👉 ఆస్తి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వేధిస్తున్నారు అంటూ వృద్ధ మహిళ ఫిర్యాదు !
👉 ప్రాణభయం ఉందంటూ జగిత్యాల కలెక్టర్‌ను ఆశ్రయించిన తల్లి దత్తప్రియ !
👉 డాక్యుమెంటరీ ఆధారాల కాపీలు అధికారులకు అందజేత !
J.SURENDER KUMAR,
కొడుకును కోల్పోయిన దుఃఖంలో ఉన్న వృద్ధ తల్లికి ఆస్తి, ఇన్సూరెన్స్ డబ్బుల వ్యవహారం మరోవైపు కోడలి తీవ్ర వేధింపులకు కారణమవుతోందని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు ధర్మపురికి చెందిన దహగం దత్తప్రియ. తనకు ప్రాణభయం ఉందని, తక్షణమే రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
👉 దత్తప్రియ ఫిర్యాదు ప్రకారం..
ఆమె చిన్న కుమారుడు దహగం గిరీష్ 2025 మే 18న గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణానంతరం తన కోడలు కామోజ్జల మానసతో పాటు ఆమె తల్లిదండ్రులు కామోజ్జల సత్యనారాయణ రావు, రామోజ్జల వాగ్దేవి తనపై ఒత్తిడి, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
👉 33 శాతం ఇన్సూరెన్స్ వాటా వదులుకోవాలంటూ ఒత్తిడి!

Boeing కంపెనీకి సంబంధించిన GTL Insuranceలో తనకు ఉన్న 33 శాతం వాటాను వదులుకునేలా NOCపై సంతకం చేయాలని బలవంతం చేస్తున్నారని దత్తప్రియ ఆరోపించారు. NOCపై సంతకం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానంలో ఉన్నప్పటికీ తనపై ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు.
👉 దాడికి ప్రయత్నించారని ఆరోపణ !
ఆగస్టు మొదటి వారంలో, అలాగే ఆగస్టు 15, 16, 17 తేదీల్లో ముగ్గురు తన ఇంటికి వచ్చి దూషిస్తూ బెదిరించారని, భౌతిక దాడికి రెండుసార్లు ప్రయత్నించారని దత్తప్రియ ఆరోపించారు. దీంతో భయాందోళనకు గురై పెద్ద కుమారుడు దహగం గణేష్ ఇంటికి వెళ్లి ఆశ్రయం పొందాల్సి వచ్చిందని తెలిపారు.
👉 అనుమానాస్పద పదార్థాలపైనా ఫిర్యాదులో ప్రస్తావన!
తాను ఇంటి నుంచి వెళ్లిన అనంతరం కిరాణా వస్తువుల్లో గుర్తు తెలియని పొడి, నూనె లాంటి పదార్థాలు కనిపించాయని దత్తప్రియ పేర్కొన్నారు. తనకు ఇప్పటికే బెదిరింపులు, దాడి ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై అనుమానం కలిగిందని తెలిపారు. ఈ అంశంపైనా సమగ్రంగా విచారణ జరిపించాలని అధికారులను కోరారు.
👉 సంతకాల దుర్వినియోగంపై విచారణ కోరుతూ..
తన అనుమతి లేకుండా తన సంతకాలను ఉపయోగించారా, ఫోర్జరీ చేశారా అనే అంశంపైనా విచారణ జరిపించాలని దత్తప్రియ విజ్ఞప్తి చేశారు. తనకు అండగా ఉన్న పెద్ద కుమారుడు, కోడలిని కూడా బెదిరిస్తూ తప్పుడు కేసుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
👉 నేను సీనియర్ సిటిజన్‌ను.. రక్షణ కల్పించాలి !

“నాకు ఎవరి మీదా ప్రతీకారం అవసరం లేదు. నా చట్టపరమైన హక్కులను న్యాయపరంగానే కోరుతున్నాను. అయితే నాకు ప్రాణభయం ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకముందే అధికారులు స్పందించి పోలీసు రక్షణ కల్పించాలి” అని దత్తప్రియ కలెక్టర్‌ను కోరారు.
తన ఫిర్యాదుకు మద్దతుగా డాక్యుమెంటరీ ఆధారాల కాపీలను సైతం అధికారులకు అందజేసినట్లు తెలిపారు. తన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని ఆమె కోరారు.
