పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణ పట్ల వివక్షతనే!

👉 కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించిన సీఎం  రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,

అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక స్పష్టమైన లక్ష్యంతో తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడమేనని నిరసనను వ్యక్తం చేశారు.


👉 ముఖ్యమంత్రి  అమెరికా పర్యటనను తిరస్కరించడంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి  సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 “అమెరికా పర్యటనకు సంబంధించి సమగ్ర వివరాలను కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖకు తెలియజేయడం జరిగింది. ఈ పర్యటనలో రహస్యాలేమీ లేవు. దాపరికం లేదు. రాజకీయ కారణాలతో అనుమతి తిరస్కరిస్తున్నామని చెప్పడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమే. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిణామాలను ముక్తకంఠంతో ఖండిస్తుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నిరసన తెలియజేస్తుంది” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

👉 తెలంగాణ పట్ల వివక్ష చూపడమే. తెలంగాణ పట్ల చులకన భావం, చిన్నచూపు సరికాదు. రాజకీయ కారణాలతో పర్యటనను తిరస్కరించడమంటే ఏంటి. దేశ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. దీనిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం” అని అన్నారు.

👉 ఫెడరల్ వ్యవస్థలో ఇలాంటి ధోరణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను చెడగొడుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ సత్సంబంధాలు ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను తిరస్కరించడాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు.

👉 పెట్టుబడులను ఆకర్షించడం, టెక్నాలజీ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఏడాది నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించడానికి అమెరికా పర్యటన తలపెట్టామని వివరించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో పెట్టుబడుల కోసం గుజరాత్ సీఎం  పర్యటనకు అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు నిరాకరించడమేంటని ప్రశ్నించారు.

👉 తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా, వికసిత్ భారత్ 2047 ఆలోచనల మేరకు దేశం ఆర్థికంగా వృద్ధిని సాధించాలన్న ఆలోచనతో విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికా పర్యటన తలపెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణకు రావలసిన పెట్టుబడులు రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

👉 “ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని భావించి, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. ఇందులో భాగంగానే విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించి విదేశీ పర్యటన ఖరారు చేసుకోవడం గతంలోనూ, ఇప్పుడూ జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఇంగ్లండ్ దేశానికి అనుమతించి అమెరికాకు తిరస్కరించారు.

👉 తిరస్కరించడమే కాకుండా తమ పర్యటనపై అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. పర్యటనకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదన్న ఆరోపణలు చేస్తున్నందున, విదేశీ పర్యటనకు సంబంధించి క్లియరెన్స్ కోసం చేసిన దరఖాస్తులో స్పష్టంగా చెప్పా”మన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  విదేశాంగ మంత్రిత్వ శాఖకు చేసిన దరఖాస్తు అంశాలను చదివి వినిపించారు.

👉 “తాను తలపెట్టింది అధికారిక పర్యటన. అధికార పర్యటన సందర్భాల్లో ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. ఇందులో దాపరికం ఉండదు. రాయబార కార్యాలయ అధికారులు పర్యటనను పర్యవేక్షించడమే కాకుండా ప్రతి సమావేశంలోనూ పాల్గొంటారు.

👉 ప్రతి సమావేశంలో చర్చించిన అంశాలన్నింటిపైనా రాయబార కార్యాలయాల అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ విషయాలన్నీ విదేశాంగ మంత్రి కి తెలుసు. విదేశాంగ మంత్రి  గతంలో విదేశాంగ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. వారికి అన్ని విషయాలు తెలుసు.

👉 విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం ఈ పర్యటన తలపెట్టాం. వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలకడానికి, ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలను హైదరాబాద్ ఆహ్వానించాలని ఈ పర్యటన లక్ష్యం.

👉 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పొటెన్షియల్ పార్ట్‌నర్‌షిప్‌ల కోసం, ముఖ్యంగా విద్య, క్రీడలు, పెట్టుబడులకు సంబంధించిన పర్యటన ఉద్దేశాలను చాలా స్పష్టంగా తెలియజేశాం.

👉 వైబ్రెంట్ గుజరాత్ పేరుతో రోడ్ షోల కోసం గుజరాత్ సీఎం కు అమెరికా, కెనడా దేశాల పర్యటనకు అనుమతించి, విద్య, క్రీడా రంగంలో పెట్టుబడులకు ఆకర్షించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. పైగా ఇంగ్లండ్ దేశం వెళ్లిన తర్వాత మధ్యలో తిరస్కరించడమేంటని” అడిగారు.

👉 “లండన్‌ పర్యటనలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్ వారితో చర్చలు జరిపాం. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. వారు కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించే విషయం పరిశీలిస్తామని చెప్పారు. త్వరలో ఒప్పందాలు చేసుకోబోతున్నాం.

👉 అమెరికా, యూకేల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందించి ప్రోత్సహిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ వర్సిటీలను ఇక్కడికి ఆహ్వానించడం ద్వారా ఉత్తమమైన విద్యను అందించడానికి వీలవుతుందని ఆలోచన చేశాం.

👉 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగాలన్న లక్ష్యం కోసం పర్యటన పెట్టుకుంటే తిరస్కరించడమంటే ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం. ఆక్షేపనీయం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం.

👉 “డిసెంబర్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఆహ్వానించాలంటే ఆయా సంస్థలు, విద్యాలయాలను నాలుగైదు నెలల ముందే ఆహ్వానాలను అందించాల్సి ఉంటుంది. వారికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ లక్ష్యాలను ఆపలేరు. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం ఆహ్వానాలను అందించడానికి అధికారులను పంపించాం” అని ముఖ్యమంత్రి  తెలిపారు.