👉 ఆగస్టు 30న నీట్–పీజీ పరీక్ష… జగిత్యాల జిల్లాలో జేఎన్‌టీయూ కొండగట్టులో పరీక్షా కేంద్రం !
👉 ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు !
J.SURENDER KUMAR,
ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్–పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
👉 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు మాట్లాడుతూ,….
ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్–పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో 17,627 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుందని, అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, జనరేటర్ బ్యాకప్, వెలుతురు, వెంటిలేషన్ తదితర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సీఎస్ తెలిపారు. అభ్యర్థుల గుర్తింపు, తనిఖీలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఏఐ గ్లాసెస్, స్పై కెమెరాలు తదితర నిషేధిత వస్తువులను అనుమతించరాదని ఆదేశించారు.
👉 ప్రశ్నాపత్రాల భద్రత, గోప్యతకు పూర్తి రక్షణ కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
👉 రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని, ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

👉 ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం, హస్తకళలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అనుసంధానిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, శుభ్రత, సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎస్ ఆదేశించారు.
👉 ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితి రూపొందించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్థానిక ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని తెలిపారు.తెలంగాణ సంస్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సీఎస్ తెలిపారు.
👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ,….
జగిత్యాల జిల్లాలో నీట్–పీజీ పరీక్ష నిర్వహణకు జేఎన్‌టీయూ కొండగట్టులో 2 పరీక్షా కేంద్రములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో మొత్తం 100 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నామని, సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
