👉 చంచల్‌గూడ జైలు సిద్ధం..!
👉 యూనిఫాం, బ్యారక్, జైలు భోజనం.. !
👉 మొబైల్‌కు మాత్రం అనుమతి లేదు !
J SURENDER KUMAR,
జైలు అంటే నేరం చేసిన వారికి శిక్ష అనుభవించే ప్రదేశం, కానీ ఇప్పుడు జైలు జీవితం ఎలా ఉంటుందో అనుభవించాలంటే నేరం చేయాల్సిన అవసరం లేదు డబ్బులు చెల్లిస్తే చాలు.. కొన్ని గంటల పాటు చంచల్‌గూడ జైలు గోడల మధ్య ‘ఖైదీ’ అనుభూతిని పొందొచ్చు. కాకపోతే ఇది నిజమైన శిక్ష కాదు.. జైలు జీవితాన్ని దగ్గరగా పరిచయం చేసే వినూత్న అనుభవ కార్యక్రమం.
తెలంగాణ జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు ప్రాంగణంలో ‘తెలంగాణ జైలు అనుభవం’ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రత్యేక అనుభవ కార్యక్రమం కొనసాగనుంది.

👉 మొబైల్ అప్పగించాలి.. యూనిఫాం వేసుకోవాలి !
సాధారణంగా జైలుకు వెళ్లేవారు బయటకు రావాలని కోరుకుంటారు.. ఇక్కడ మాత్రం జైలు అనుభవం కోసం స్వచ్ఛందంగా లోపలికి వెళ్లాలి అయితే కొన్ని నియమాలు తప్పనిసరి. లోపలికి వెళ్లగానే మొబైల్ ఫోన్‌ను అప్పగించాలి. జైలు యూనిఫాం ధరించాలి. జైలు తరహా ప్లేట్లు, గ్లాసుల్లోనే భోజనం చేయాలి. ఖైదీలకు అందించే తరహా ప్రామాణిక భోజనాన్నే స్వీకరించాలి.
👉 ఉదయం 6 గంటలకే దినచర్య మొదలవుతుంది. శారీరక శిక్షణ, యోగా, ధ్యానం, కవాతు, పని కేటాయింపులతో పాటు కుట్టుపని, వ్యవసాయం, పరిశుభ్రత వంటి కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అంటే.. ‘వీకెండ్ అడ్వెంచర్’ అనుకుని వెళ్తే.. అక్కడ అడ్వెంచర్ కంటే క్రమశిక్షణే ఎక్కువ .
👉 జైలు అనుభవానికి నాలుగు రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
4 గంటలు – ₹ 500
8 గంటలు – ₹.750
12 గంటలు – ₹ 1,000
24 గంటలు – ₹ 1,500
అంటే.. ₹ 500తో నాలుగు గంటల జైలు అనుభవం..
₹.1,500తో ఒకరోజు పూర్తి ప్యాకేజీ!
18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఇందులో పాల్గొనవచ్చు.
👉 బ్యారక్‌లో రాత్రి బస కూడా !

మరి జైలు అనుభవం అర్ధంతరంగా ఎందుకు? అనుకునేవారికి రాత్రి బస చేసే అవకాశమూ ఉంది. పురుషులు, మహిళలకు వేర్వేరు సురక్షిత వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. బ్యారక్‌లలో నిర్దేశిత సౌకర్యాలు ఉంటాయి. పర్యవేక్షణలో అత్యంత భద్రత గల బ్యారక్, డార్క్-సెల్ వంటి వాతావరణాలను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది.
అయితే ఇది సరదా కోసం మాత్రమే కాదు. జైలు నియమాలు, దిద్దుబాటు విధానాలు, పునరావాస ప్రక్రియ గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
👉 ‘జైలు’ అంటే శిక్ష మాత్రమే కాదు.. మార్పుకు వేదిక !
డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ..
ఈ మ్యూజియంను అవగాహన, విద్య, పరిశోధన, ఆత్మపరిశీలనకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలోని పాత జైలు మ్యూజియం కూలిపోవడంతో చంచల్‌గూడలో ఈ భావనను పునరుద్ధరించి మరింత విస్తరించినట్లు చెప్పారు.

ప్రాచీన శిక్షా పద్ధతుల నుంచి ఆధునిక దిద్దుబాటు, పునరావాస విధానాల వరకు జైలు వ్యవస్థలో వచ్చిన మార్పులను నేపథ్య గ్యాలరీలు, పునర్నిర్మించిన జైలు నిర్మాణాలు, వివిధ ప్రదర్శనల ద్వారా సందర్శకులకు పరిచయం చేయనున్నారు.
మొత్తానికి.. జైలును బయట నుంచి చూడటమే కాదు.. లోపలికి వెళ్లి అక్కడి క్రమశిక్షణను అనుభవించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
బుకింగ్స్: తెలంగాణ జైలు అనుభవం అధికారిక వెబ్‌సైట్,
ఆన్‌లైన్ బుకింగ్‌లు మరియు ప్రజల సందర్శనల కోసం ఈ శాఖ www.telanganajailexperience.com అనే అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది.
