ప్రజల వద్దకే పాలన సమస్య పరిష్కారం వరకు పర్యవేక్షణ !

👉 ప్రజలతో ముఖాముఖికి విశేష స్పందన !

👉 వినతులపై అధికారులకు మంత్రి ఆదేశాలు !

👉 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం !

👉 హౌస్‌ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ నేతల మాటలు సిగ్గుచేటు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ !

J.SURENDER KUMAR,

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ప్రజా సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించడంతో పాటు.. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, ఒక్కో సమస్యను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

👉 వినతులు స్వీకరించడంతో కార్యక్రమం పూర్తి కాదు!

ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో కార్యక్రమం ముగిసిపోదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యలను పర్యవేక్షిస్తూ.. సమస్య పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు. అత్యవసర సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని, మిగిలిన సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఎస్సీలు, గిరిజనులు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్లు, పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. ‘ప్రజల వద్దకే పాలన’ అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు.

👉 ప్రజల గొంతుకకు అడ్డుకట్ట వేయలేదు.. ప్రజల వద్దకే వెళ్తున్నాం !

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. హౌస్‌ అరెస్టుల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. 2014 నుంచి 2023 వరకు ప్రతిపక్ష నేతలను ఇంటి నుంచి బయటకు రానిచ్చారా? అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌ సిరిసిల్లకు వచ్చిన సందర్భంలో తనను ధర్మపురిలో హౌస్‌ అరెస్టు చేసేవారని గుర్తుచేశారు.

👉 నాడు ప్రతిపక్ష నేతలను నిర్బంధించిన వారు.. నేడు హౌస్‌ అరెస్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత పాలనలో ప్రజల గొంతుకకు అడ్డుకట్ట వేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను వింటోందని అన్నారు.

👉 ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే లక్ష్యం !

గత పాలనకు భిన్నంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరిస్తున్నామని చెప్పారు.

“ప్రజల సమస్యలను వినడమే కాదు.. వాటికి పరిష్కారం చూపే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే మా ప్రభుత్వ విధానం” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.