ఉపాధ్యాయుడే ప్రాణాలు కాపాడాడు!

👉 ఒక్క ఫోన్ కాల్‌తో అప్రమత్తం..

👉 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు !

👉 నేపాల్ వరదల్లో రియల్ హీరోగా నిలిచిన రాజేంద్ర దవాడి !

👉 ఉపాధ్యాయుల సేవకు మరో గొప్ప ఉదాహరణ !


J.SURENDER KUMAR,


ఓ వైపు ఉప్పొంగుతున్న నది.. మరోవైపు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ప్రజలు.. క్షణక్షణానికీ పెరుగుతున్న జలప్రవాహం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్క క్షణం ఆలస్యం చేసినా వందలాది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కానీ ఓ ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి, ముందుచూపు, ధైర్యం ఏకంగా 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది.

👉 నేపాల్‌లో ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తు వేళ నువాకోట్‌లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దవాడి (47) చూపిన చాకచక్యం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

👉 ఒక్క ఫోన్ కాల్.. వందల ప్రాణాలకు రక్షణ !

బుధవారం ఉదయం సుమారు 9:20 గంటలకు రాజేంద్ర దవాడి పాఠశాలకు చేరుకున్నారు. అదే సమయంలో త్రిశూలి నదికి సమీపంలోని గ్రామం వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని ఆయనకు స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. పాఠశాల భవనం మూడు అంతస్తుల కాంక్రీట్ నిర్మాణం కావడంతో తొలుత పెద్దగా ప్రమాదం ఉండదని భావించినా.. బయట పరిస్థితిని గమనించిన రాజేంద్రకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. క్షణం కూడా వృథా చేయకుండా సైరన్ మోగించారు.

ఉపాధ్యాయులను అప్రమత్తం చేసి.. 1,643 మంది విద్యార్థులను వెంటనే పాఠశాల నుంచి బయటకు తీసుకొచ్చారు. వారందరినీ సమీపంలోని కొండపై ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు. విద్యార్థులు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్దిసేపటికే.. ఉప్పొంగిన నది ప్రవాహం పాఠశాల భవనాన్ని చుట్టుముట్టింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయం ఎంత కీలకమో స్పష్టమైంది.

👉 ప్రాణాలను కాపాడిన ఉపాధ్యాయుడు.. త్యాగం చేసిన సిబ్బంది !

విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటం వెనుక ప్రధానోపాధ్యాయుడితో పాటు పాఠశాల సిబ్బంది చూపిన సమిష్టి చొరవ కూడా ఉంది. అయితే ఈ ఘటనలో ఇద్దరు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.

ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్ (32) అల్పాహారం కోసం గదికి వెళ్లిన సమయంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. పాఠశాల తలుపులు మూసేందుకు వెళ్లిన జానిటర్ సుల్తాన్ లామా కూడా నీటి ఉధృతికి ప్రాణాలు కోల్పోయారు. ఓ విద్యార్థిని భయంతో స్పృహ కోల్పోగా.. ఓ ఉపాధ్యాయుడు ఆమెను మోటార్‌సైకిల్‌పై సురక్షితంగా కొండపైకి తీసుకెళ్లడం కూడా ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.

👉 ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు..

తరగతి గదిలో పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు.. అవసరమైనప్పుడు వందలాది జీవితాలకు రక్షకుడిగా మారగలడని నేపాల్ ఘటన మరోసారి నిరూపించింది.
విపత్తు ముంచుకొస్తున్న సమయంలో భయానికి లోనుకాకుండా పరిస్థితిని అంచనా వేసి, వెంటనే నిర్ణయం తీసుకుని, వేలాది మంది పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించిన రాజేంద్ర దవాడి.. నిజమైన ‘రియల్ హీరో’ గా నిలిచారు.

👉 ఒక ఫోన్ కాల్‌ను నిర్లక్ష్యం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.!

👉 ఒక్క నిర్ణయం ఆలస్యమై ఉంటే వందలాది కుటుంబాల్లో విషాదం నిండేది.!

👉 ఓ ఉపాధ్యాయుడి అప్రమత్తత.. 1,643 మంది విద్యార్థులకు జీవితాన్ని ప్రసాదించింది.!

👉ఉపాధ్యాయుల సేవకు.. సమయస్ఫూర్తికి.. అంకితభావానికి ఈ ఘటన ఒక గొప్ప నిదర్శనం !

👉 👉 (OneIndia సౌజన్యంతో )