👉 అక్రమ కలప రవాణా, అటవీ నేరాల నివారణకు ప్రత్యేక నిఘా…. !
👉 అటవీ–రెవెన్యూ భూ రికార్డుల వ్యత్యాసాలను రీసర్వేలో పరిష్కరించాలి…..!
👉 రిజర్వ్‌డ్ ఫారెస్ట్ భూముల్లో అనధికార పట్టాలపై సమగ్ర పరిశీలన….!
👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్..!
J.SURENDER KUMAR,
జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో అటవీ విస్తీర్ణం, అటవీ భూముల ఆక్రమణలు, అటవీ–రెవెన్యూ భూ రికార్డుల వ్యత్యాసాలు, అనధికార పట్టాలు, అటవీ నేరాల నివారణ, ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ప్రాజెక్టుకు సంబంధించిన భూ వివాదాలపై సమీక్షించారు.
👉 జిల్లాలో 53,734.78 హెక్టార్ల అటవీ విస్తీర్ణం..!
జిల్లాలో మొత్తం 53,734.78 హెక్టార్ల అటవీ విస్తీర్ణం, అంటే 1,32,778.66 ఎకరాలు ఫారెస్ట్ రికార్డుల్లో నమోదై ఉన్నట్లు అధికారులు వివరించారు. మొత్తం అటవీ ప్రాంతం 5 రేంజ్‌లు, 22 సెక్షన్లు, 67 బీట్లు, 253 కంపార్ట్‌మెంట్ల పరిధిలో ఉంది.
👉 ఫారెస్ట్–రెవెన్యూ రికార్డుల రీకన్సిలియేషన్..!
ఫారెస్ట్ రికార్డులు, రెవెన్యూ రికార్డుల్లోని 22ఏ1 పహాణి వివరాలను సరిపోల్చి రీకన్సిలియేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫారెస్ట్ రికార్డుల ప్రకారం 1,32,778.66 ఎకరాలు ఉండగా, 22ఏ1 పహాణి రికార్డుల్లో 57,842.25 ఎకరాలు, మరో విభాగంలో 75,198.14 ఎకరాలు నమోదై ఉన్నట్లు అధికారులు వివరించారు.
రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టత తీసుకురావాలని, సుమారు 26 వేల ఎకరాల వ్యత్యాసానికి సంబంధించిన భూ వివాదాలను రీసర్వే కార్యక్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
👉 అటవీ భూముల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి..!
జిల్లాలోని రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అటవీ భూముల ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధర్మపురి రేంజ్‌లో 3,649.88 ఎకరాలు, మెట్‌పల్లి రేంజ్‌లో 621.92 ఎకరాలు, కోడిమియాల్ రేంజ్‌లో 91.05 ఎకరాల ఆక్రమణలు నమోదైనట్లు తెలిపారు. రాయికల్ రేంజ్‌లో 114.23 ఎకరాలకు సంబంధించిన ఆక్రమణ, భూ వివాదాలు ఉన్నట్లు అధికారులు వివరించారు.
అటవీ భూములపై హక్కులు కోరుతున్న గ్రామీణులు, గిరిజనులకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న కేసులను మాత్రమే చట్టబద్ధమైన విధానంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
👉 5,016.99 ఎకరాలకు అనధికార పట్టాలు..!
గత 20 సంవత్సరాల కాలంలో రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల ద్వారా 5,016.99 ఎకరాలకు అనధికార పట్టాలు మంజూరైనట్లు అధికారులు వివరించారు. ఈ పట్టాలకు సంబంధించిన ఫారెస్ట్, రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏదైనా పట్టా మంజూరు చేసిన అనంతరం దానిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, పట్టా మంజూరు సమయంలో అనుసరించిన అదే విధానాన్ని అనుసరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
👉 అటవీ & రెవెన్యూ శాఖల పరస్పర సహకారం అందించాలి..!

అటవీ సంరక్షణలో రెవెన్యూ శాఖ అధికారులు అటవీ శాఖకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ ప్రాంతాల అంచున ఉన్న, సమస్యాత్మక గ్రామాల్లో అటవీ సంరక్షణ కమిటీ సమావేశాల నిర్వహణలో అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని, సంబంధిత రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని సూచించారు.
అటవీ భూముల ఆక్రమణలను గుర్తించడం, నివారించడంలో అటవీ శాఖకు సహకరించాలని, అటవీ–రెవెన్యూ సరిహద్దు వివాదాలను సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన రెవెన్యూ, భూ రికార్డులు, మ్యాపులు, సర్వే వివరాలను పరస్పరం అందుబాటులో ఉంచి ధృవీకరించాలని సూచించారు.
అక్రమంగా చెట్ల నరికివేత, అటవీ ఉత్పత్తుల అక్రమ తరలింపు, ఇతర అటవీ నేరాల నివారణ, గుర్తింపు, సమాచారాన్ని అటవీ శాఖకు అందించడంలో రెవెన్యూ అధికారులు సహకరించాలని తెలిపారు. ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, ఇతర అటవీ సంరక్షణ అంశాల్లో అటవీ అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
స్థానిక భూ సంబంధిత ఫిర్యాదులు, వివాదాలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ సహకరించాలని, అటవీ సంరక్షణ, అమలు చర్యల సమయంలో అవసరమైన పరిపాలనా, క్షేత్రస్థాయి సహాయాన్ని అందించాలని సూచించారు. అటవీ సంరక్షణ కమిటీ కార్యకలాపాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, అటవీ పరిరక్షణలో వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
👉 ఎస్.ఆర్.ఎల్.ఐ.పీ భూముల వివాదాల పరిష్కారం..!
కోరుట్ల డివిజన్‌లో ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 610.17 ఎకరాల పరిహార భూమి కేటాయించగా, 518.28 ఎకరాలు వివాదరహితంగా, 91.29 ఎకరాలు ఆక్రమణ/వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివాదంలో ఉన్న భూములకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు కేటాయించాల్సిన 91.29 ఎకరాల భూమి గుర్తింపు అంశాన్ని సమీక్షించారు.
కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 570, 571లో 92.00 ఎకరాల రెవెన్యూ భూమిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూమిపై సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
👉 అక్రమ కలప రవాణాపై నిరంతర నిఘా…!

జిల్లాలో గుర్తించిన అక్రమ కలప రవాణా మార్గాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ నేరాలను అరికట్టేందుకు అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్, ఆర్డీవోలు, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఏ.డి,ఎస్.ఎల్.ఆర్. కిషన్ ప్రసాద్, సంబంధిత రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
