👉 గత ఆరు నెలల ప్రసవాల వివరాలతో ప్రతి శిశువు ఆధార్ నమోదును పరిశీలించాలి !
👉 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలి !
👉 ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి !
👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్….!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో ఆధార్ నమోదు, ఆధార్ వివరాల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఆధార్ వివరాలు సక్రమంగా నమోదు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…...

జగిత్యాల జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 49,413 మంది , 6–17 సంవత్సరాల వయస్సు గల 2,34,451 మంది ఆధార్ వివరాలను నమోదు చేయడం లేదా అవసరమైన మేరకు నవీకరించడం పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.
వయస్సుల వారీగా ఆధార్ నమోదు, నవీకరణకు సంబంధించిన వివరాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ నమోదు కాని వారు, ఆధార్ వివరాలు నవీకరించాల్సిన వారు ఎవరూ మిగలకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.
👉 ఆరేళ్లు నిండిన చిన్నారులకు బయోమెట్రిక్ నవీకరణ !
0–5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు సమయంలో ఫొటోగ్రాఫ్ మాత్రమే తీసుకుంటారని, బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయరని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిన్నారికి 6 సంవత్సరాలు నిండిన వెంటనే బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థల్లో 6 సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారి ఆధార్‌లో బయోమెట్రిక్ నవీకరణ జరిగిందా లేదా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ నమోదు కాని పిల్లలను గుర్తించి, వారికి ఆధార్ నమోదు చేయించడంతో పాటు అవసరమైన చోట బయోమెట్రిక్ నవీకరణ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 గత ఆరు నెలల ప్రసవాల వివరాలతో పరిశీలన !
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో గత ఆరు నెలల్లో జరిగిన ప్రసవాల వివరాలను సేకరించి, జన్మించిన ప్రతి శిశువుకు ఆధార్ నమోదు జరిగిందా లేదా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత ఆరు నెలల్లో జరిగిన ప్రసవాల జాబితాను ఆధార్ నమోదు వివరాలతో సరిపోల్చి, ఆధార్ నమోదు కాని శిశువులను గుర్తించాలని సూచించారు. ప్రతి శిశువుకు ఆధార్ నమోదు జరిగేలా తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించి, అవసరమైన చోట ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
👉 ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు పరిశీలించాలి !
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతి చిన్నారి ఆధార్ కార్డు వివరాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆధార్ నమోదు స్థితి, ఆధార్ వివరాల నవీకరణ, ముఖ్యంగా 6 సంవత్సరాలు నిండిన పిల్లల బయోమెట్రిక్ నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల వారీగా ఆధార్ నమోదు, నవీకరణకు సంబంధించిన వివరాలను సేకరించి పెండింగ్‌లో ఉన్న పిల్లలను గుర్తించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి విద్యార్థికి అవసరమైన ఆధార్ సేవలు అందేలా చూడాలని సూచించారు.
👉 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలి..!
ఆధార్ నమోదు, నవీకరణ కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో పిల్లలకు అనుకూలంగా శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
ఆధార్ నమోదు, నవీకరణకు అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, శిబిరాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేయాలని తెలిపారు.
👉 శాఖల మధ్య సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలి !

వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఆధార్ నమోదు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శాఖ తన పరిధిలో ఆధార్ నమోదు, నవీకరణకు సంబంధించిన పెండింగ్ వివరాలను గుర్తించి, నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఆధార్ వివరాల్లో పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించి, అవసరమైన చోట్ల నవీకరించాలని తెలిపారు. ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి…!
చిన్నారులకు ఆధార్ నమోదు, 6 సంవత్సరాలు నిండిన తర్వాత బయోమెట్రిక్ నవీకరణ ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించి, పెండింగ్‌లో ఉన్న ఆధార్ నమోదు, నవీకరణను పూర్తి చేయించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరి ఆధార్ వివరాలు నమోదు కావడంతో పాటు, అవసరమైన నవీకరణలు పూర్తయ్యేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్,
రెవెన్యూ డివిజనల్ అధికారులు మధుసూదన్ , దివాకర్ రెడ్డి , నరసింహారావు, కలెక్టరేట్ సెక్షన్స్ సూపర్ ఇండెంటు జ్యోతి, యూఐడీఏఐ హైదరాబాద్ ఆర్వో శ్రావణ్,ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ మమత,డీడబ్ల్యూఓ భాస్కర్, డీఈఓ రాము, డీఎంహెచ్‌వో సుజాత, ఎల్‌డీఎం రాము, పోస్టల్ సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
