ధర్మపురిలో మరో చారిత్రిక ఘట్టానికి శ్రీకారం..!

👉 వందల సంవత్సరాల తరువాత ఆలయ పునర్ నిర్మాణానికి శ్రీకారం..

👉 పునర్ నిర్మాణంపై పై అన్ని వర్గాల హర్షం..!

👉 ఉగ్ర నరసింహా ఆలయ పునర్ నిర్మాణానికి ₹10 కోట్లు కేటాయించిన కాంగ్రెస్ సర్కార్..!

👉 సోమవారం తెల్లవారుజామున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భూమి పూజ..!

J SURENDER KUMAR,

దక్షణ కాశీగా పేరు గాంచిన ధర్మపురిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్ నిర్మాణానికి వందల ఏళ్ల తరువాత సోమవారం తెల్లవారుజామున అడుగులు ముందుకు పడుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ధర్మపురిలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ₹ 10 కోట్లు కేటాయించింది.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురి క్షేత్రంలోని ఆలయ అభివృద్దికి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ధర్మపురి క్షేత్రంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయం రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. ఆలయ అభివృద్ది పనులకు రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ధర్మపురిలో భూమి పూజ నిర్వహించి ఆలయ పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చూడుతున్నారు.!


👉 ధర్మపురి ఆలయ చరిత్ర..


తెలంగాణలోని ప్రసిద్ధ నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం అత్యంత చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు నిలయంగా పేరు ఉన్నది. పూర్వం ‘ధర్మవర్మ’ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వలన ‘ధర్మపురి’ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.

క్రీ.శ. 850– -928 కాలం నాటికంటే ముందుగా భావించే ఈ ఆలయం, 1422–-1436 మధ్య బహుమనీ సుల్తానుల దండయాత్రలలో ధ్వంసమైనట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. 17వ శతాబ్దంలో తిరిగి ఆలయం పునరుద్ధరించబడినట్లు ఇక్కడ లభించిన శాసననాల ద్వార తెలుస్తుంది. ప్రధాన దైవమైన శ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి వారు సాలగ్రామ శిలగా వెలసి ఉన్నారు.


👉 దక్షిణకాశీగా మరియు త్రిమూర్తి క్షేత్రంగా ఖ్యాతి..!


గోదావరి నది ఈ క్షేత్రానికి ఆనుకుని దక్షిణ వాహినిగా ప్రవహిస్తుండటంతో ధర్మపురి ‘దక్షిణకాశీ’గా, ‘తీర్థరాజముగా’ మరియు ‘హరిహర క్షేత్రముగా’ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంగణంలో బ్రహ్మదేవుడు, విష్ణు స్వరూపుడైన నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వరస్వామి కొలువుదీరి ఉండటంతో ఇది ‘త్రిమూర్తి క్షేత్రం’గా పిలువబడుతోంది. అంతేకాకుండా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ యమధర్మరాజు ఆలయం కూడా ఉండటం విశేషం. “ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు” అనే ప్రగాఢ నమ్మకం భక్తులలో ఉంది.


👉 ప్రత్యేకతలు మరియు విశ్వాసాలు !


⭐ వేదాలు, సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కవిత్వానికి ధర్మపురి పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది.


⭐ ఇక్కడ గోదావరి నదిలో బ్రహ్మగుండం, సత్యవతి గుండం, యమగుండం, పాలగుండం, చక్రగుండం అనే పుణ్య గుండాలు ఉన్నాయి.


⭐ దత్తాత్రేయ పురాణం ప్రకారం.. దక్షిణ వాహినిగా ప్రవహించే గోదావరిలో మూడు పర్యాయాలు స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తే, మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


⭐ పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్నో క్షేత్రాలు తిరిగినప్పటికీ ఫలితం లేక, ధర్మపురిని సందర్శించి గోదావరిలో స్నానమాచరించగా సర్పరూపం తొలగి సుందర పురుష రూపం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది.


👉 ₹10 కోట్లతో అభివృద్ధి….!


ధర్మపురి లోని ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం ₹ 10 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ఉగ్ర నరసింహ ఆలయం 990 స్క్వేర్ ఫీట్ల వెడల్పులో ఉండడంతో రోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వందేళ్ల వరకు వచ్చే భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రముఖ స్తపతుల ద్వారా ఆగమ శాస్త్ర ప్రకారం పునర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.

ఆలయ పునర్ నిర్మాణం కోరకు ఇప్పటికే ధర్మపురిలో వేద బ్రాహ్మణులు, అగ్రహారం పెద్దలతో పాటు ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పూర్తి అయితే ధర్మపురి క్షేత్రానికి మరింత శోభ రానున్నది.


👉 సోమవారం తెల్లవారుజామున భూమి పూజ…!

సోమవారం తెల్లవారు జామున 2గంటల 48 నిమిషాలకు వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు⭐

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ధర్మపురిలో మరో చారిత్రక ఘట్టానికి తెరలేవనున్నది. ధర్మపురిలోని ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం సోమవారం తెల్లవారు జామున 2గంటల 48 నిమిషాలకు వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు.


👉 భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు.