👉 కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ !
J.SURENDER KUMAR,
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే వెయ్యి రోజుల ప్రజా పాలన ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు సిరిసిల్ల వస్తానని, వచ్చే నెల సిద్దిపేట వచ్చి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, మా కాంగ్రెస్ కార్యకర్తలు దండయాత్ర చేస్తారని కల్వకుంట్ల కుటుంబానికి సీఎం బహిరంగ సవాల్ చేశారు.
👉 నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న ఏర్పాటు చేసిన ఈ వేదిక సమక్షంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే, ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కొందరు దుర్మార్గులు ఊరూరా తిరుగుతూ గంగిరెద్దుల్లా విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
👉 రైతు సంక్షేమంలో రికార్డు అసెంబ్లీలో లెక్కలు తేలుద్దాం!
గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా మరింత పెంచి అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. 2014, 2018లలో కేసీఆర్ రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి వడ్డీల పాలు చేశారని, ఓఆర్ఆర్ అమ్ముకుని ₹ 7 వేల కోట్లు మింగేసి, చివరి విడత రైతుబంధు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక 25.35 లక్షల మంది రైతులకు ₹ 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని, 32 నెలల్లో ₹ 36 వేల కోట్లు రైతు భరోసా అందించామని వెల్లడించారు.
👉 వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ మాటలను తిప్పికొడుతూ, 30 నెలల్లో రైతుల ఖాతాల్లో ₹ 90 వేల కోట్లు జమ చేశామని, సన్న వడ్లకు ₹ 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్ కోసం ₹ 30 వేల కోట్లు, మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలకు ₹ 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని, దమ్ముంటే తండ్రీ కొడుకులు, అల్లుడు అసెంబ్లీకి వచ్చి లెక్కలు తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
👉 మహిళా సాధికారతకు పెద్దపీట.. కోటీశ్వరులుగా ఆడబిడ్డలు!
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించామని, ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీకి ₹ 11 వేల కోట్లు చెల్లించిందని రేవంత్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఓర్వలేక ఆటో డ్రైవర్లను కేసీఆర్ రెచ్చగొట్టించారని, ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం ఉచిత ప్రయాణం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకివ్వడం ద్వారా నెలకు ₹ 70 వేల ఆదాయం సమకూర్చామన్నారు.
👉 పెట్రోల్ బంకులు, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాలకు అప్పగించామని, హైటెక్ సిటీ వద్ద ₹1000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బడి పిల్లల దుస్తులు కుట్టే పని, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతలను మహిళలకే ఇచ్చామని, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ప్రకటించారు.
👉 ఉద్యోగాల పండగ…పేద బిడ్డలకు ఉన్నత పదవులు!
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల యువత బలిదానాలు చేస్తే, పదేళ్లలో శ్రీకాంతాచారి కుటుంబాన్ని కేసీఆర్ పట్టించుకున్నారా ,? అని ప్రశ్నించారు.
👉 ప్రశ్నాపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. తాము రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకుంటే, తాము పేదలు, బడుగు బలహీన వర్గాల నాయకులకు పట్టం కట్టామని రేవంత్ వివరించారు.
👉 సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రులను చేశామని, చామల కిరణ్‌ను ఎంపీని చేశామని, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, సత్యంలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని చెప్పారు. శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలికి పదవులిచ్చి గౌరవించామని, మహేష్ కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించామని గుర్తుచేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ప్రతిష్టించామని పేర్కొన్నారు.
👉 సంస్కారంలేని బిఆర్ఎస్ ముఠా 2034 వరకు కాంగ్రెస్ రాజ్యమే !
రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డులకు, 3.48 కోట్ల మందికి సన్న బియ్యం, 50 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్, ₹10 లక్షల ఆరోగ్యశ్రీ అందిస్తున్నామన్నారు. తనపై చదువు గురించి మాట్లాడే కేటీఆర్ గుంటూరు తెలివితేటలు చూపిస్తున్నారని, గుంటూరులో చదివిన కేటీఆర్‌కు చెప్రాసీ నౌకరీ కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు.
👉 బందిపోట్ల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకున్నారని తిహార్ జైలు నుంచి వచ్చిన కవితకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ ఇంట్లో నుంచి గెంటేశారని, పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తే కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని ఆరోపించారు.
👉 ఏడాది పొడవునా ఉద్యోగానికి రాకపోతే సాధారణ ఉద్యోగిని బర్తరఫ్ చేస్తారని, ₹.22.24 కోట్ల ప్రజాధనం జీతంగా తీసుకుంటూ ఒక్క రోజు కూడా బయటకు రాని కేసీఆర్‌ను డిస్మిస్ చేయాలా వద్దా అని ప్రశ్నించారు.
👉 తెలంగాణ తులసివనంలో గంజాయి లాంటి బీఆర్ఎస్ మొక్కను పీకేస్తామని, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేశారు.
👉 రాబోయే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 117, లేకుంటే 90 సీట్లతో గెలిచి 2034 వరకు ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగిస్తామని, కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, లేదంటే గౌరవంగా రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
