దైవ కార్యక్రమం రాజకీయాలకు అతీతం !

👉 ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డికి ఆహ్వానం !

👉 అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించండి..!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశం !


J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. “దైవ కార్యక్రమం.. దేవుడు అందరికీ దేవుడే” అన్న భావనతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

ఆదివారం భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ధర్మపురి ఆలయానికి చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్.. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులను కార్యక్రమానికి ఆహ్వానించారా? అని ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. వెంటనే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు.

👉మాజీ మంత్రులకు ఆలయం నుంచి ఆహ్వానం !

మంత్రి ఆదేశాల మేరకు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటిపర్తి జీవన్‌రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ దావా వసంతలను కలిసి భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. కార్యక్రమ వివరాలను వారికి తెలియజేసి, పాల్గొనాల్సిందిగా కోరారు.

👉.₹10 కోట్ల నిధులతో ఆలయ అభివృద్ధి !


శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను సుమారు ₹10 కోట్ల నిధులతో చేపట్టనున్నట్లు ఈవో వారికి వివరించారు. సోమవారం తెల్లవారుజామున జరిగే భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

👉పార్టీలకు అతీతంగా.. భక్తులందరికీ !

ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కార్యక్రమం అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాగాలన్న ఉద్దేశంతో స్థానిక బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఆలయ అధికారులు ఫోన్ ద్వారా ఆహ్వానాలు అందించారు. దైవ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ అందరినీ భాగస్వాములను చేయాలన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ వైఖరి ప్రస్తుతం ధర్మపురిలో చర్చనీయాంశంగా మారింది.