దశాబ్దాల గణపతి చరిత్రకు ఒక్క ప్రశ్నేనా..?

👉సుదీర్ఘకాలం పదవిలో ఉన్నారు ఏం చేశారు ? అనడం సులభం !

👉 గణపతి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రను చూడాలి !


J.SURENDER KUMAR,


జగిత్యాల జైత్రయాత్ర నుంచి దండకారణ్యం వరకు…. కొండపల్లి సీతారామయ్య నుంచి గణపతి వరకు…. గణపతి నుంచి బసవరాజు వరకు.. ..ఇప్పుడు లొంగుబాట్ల దశ వరకు.. ఇది ఒక్క నాయకుడి పదవీకాలం కాదు….. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో మలుపులు తిరిగిన మావోయిస్టు ఉద్యమ చరిత్ర…..! ‘సుదీర్ఘకాలం పదవిలో ఉన్నారు.. ఏం చేశారు ? అనడం సులభం…కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగేయాల్సిందే……

జగిత్యాల జైత్రయాత్ర నుంచి…. దండకారణ్యం వరకు…
కొండపల్లి సీతారామయ్య నుంచి…… గణపతి వరకు, గణపతి నుంచి బసవరాజు వరకు, అక్కడి నుంచి ప్రస్తుత లొంగుబాట్ల దశ వరకు సాగిన పరిణామాలను ఒకే కోణంలో చూడలేం. గణపతి సుదీర్ఘ నాయకత్వాన్ని కేవలం ‘ఎంతకాలం పదవిలో ఉన్నారు.?  అనే ప్రశ్నతో కొలవడం అంటే…. చరిత్రను ఒకే కోణంలో కుదించడం అవుతుంది..

👉 సాంకేతికత లేని రోజుల్లోనే ….,!

నేటి రోజుల్లో సమాచారం క్షణాల్లో చేరుతోంది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, ఆధునిక రవాణా వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి. కానీ గణపతి నాయకత్వం ఎదిగిన కాలంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అలాంటి సమయంలోనే పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ గ్రామీణ ప్రాంతాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంది. ఉత్తర తెలంగాణను దాటి దండకారణ్యంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ కార్యకలాపాలు విస్తరించాయి. అందుకే గణపతి సుదీర్ఘ నాయకత్వాన్ని కేవలం పదవీకాలం ఆధారంగా అంచనా వేయడం సరైన చారిత్రక విశ్లేషణ కాదు.

👉 సీతారామయ్య తర్వాత ……!

1970లలో ఉత్తర తెలంగాణలోని భూసంబంధ, వెట్టి చాకిరి బాంచన్ దొర, అంటరానితనం ,సామాజిక సమస్యల నేపథ్యంలో ఉద్భవించిన ఉద్యమం 1978 జగిత్యాల జైత్రయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1980లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ ఏర్పడింది. అనంతరం నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. సీతారామయ్య తర్వాత గణపతి నాయకత్వంలోకి వచ్చిన కాలం ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.

1990ల ప్రారంభంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గణపతి.. 2004లో పీపుల్స్‌వార్‌, ఎంసీసీ విలీనంతో ఏర్పడిన సీపీఐ (మావోయిస్టు) పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇది కేవలం రెండు సంస్థల విలీనం మాత్రమే కాదు.. దేశంలోని పలు ప్రాంతాల్లో అప్పటికే ఉన్న నక్సలైట్‌ శక్తులను ఒకే సంస్థాగత నిర్మాణంలోకి తీసుకువచ్చిన కీలక పరిణామం.

👉 ‘జనతన సర్కార్‌’ నుంచి ….…!

దండకారణ్యంలో మావోయిస్టులు తమ ప్రభావ ప్రాంతాల్లో ‘జనతన సర్కార్‌’ పేరుతో ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు వారు ప్రకటించారు. అదే సమయంలో దండకారణ్యం మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య సుదీర్ఘ హింసాత్మక ఘర్షణలకు కేంద్రంగా మారింది. ఈ ఘర్షణల ప్రభావం సాధారణ ప్రజలపైనా పడింది. ప్రాణనష్టం, నిర్బంధాలు, నిర్వాసితత్వం, భయాందోళనలు.. ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందుకే గణపతి కాలాన్ని అంచనా వేయాలంటే ఒకవైపు సంస్థాగత విస్తరణను మాత్రమే కాదు.. మరోవైపు హింస, ప్రాణనష్టం, ప్రజలపై పడిన భారాన్ని కూడా కలిపి చూడాల్సిందే.

👉  తప్పుకున్నా.. ఉద్యమం ఆగలేదు….!

వయసు, ఆరోగ్య కారణాలతో గణపతి 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి  తప్పుకున్నారు. ఆయన స్థానంలో బసవరాజు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. గణపతి తప్పుకున్న తర్వాత ఉద్యమం ఏ స్థితికి చేరింది ? ..2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భద్రతా ఆపరేషన్‌లో బసవరాజుతో పాటు పలువురు కీలక మావోయిస్టు నాయకులు హతమయ్యారు. 

అనంతరం కీలక నాయకుల లొంగుబాట్లు కూడా పెరిగాయి. 2026లోనూ పలువురు కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, ఇతర కీలక నాయకులు ఆయుధాలు వీడి ప్రభుత్వాల ముందు లొంగిపోవడం.. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన ఉద్యమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంకేతంగా కనిపిస్తోంది.

👉 ‘అర్థం చేసుకోలేకపోయాం’ అగ్రనేతలే అంగీకరించిన పొరపాట్లు !

కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి లొంగుబాటుకు ముందు విడుదల చేసిన ప్రకటనలో.. ప్రస్తుత పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేకపోయామని, పొరపాట్లు జరిగాయని పేర్కొన్నట్లు సమాచారం. 2025 ఆగస్టులో విడుదలైన ఆరు పేజీల ప్రకటనలో ఉద్యమ తీరుతెన్నులు, ప్రస్తుత పరిస్థితులు, గత నిర్ణయాలపై ఆత్మవిమర్శ కనిపించింది.
దాదాపు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

👉 ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగి పోవడానికి ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పుతూ రాసిన లేఖ ,( ఫైల్ ప్రతి)

ఉద్యమం ఎదుర్కొంటున్న సంక్షోభంపై బయటివారు మాత్రమే విశ్లేషణ చేయడం కాదు.. ఉద్యమంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకులే తమ నిర్ణయాలు, విధానాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆత్మపరిశీలన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

👉 మావోయిస్టుల హింసను ప్రశ్నించిన బాలగోపాల్‌ !

మానవ హక్కుల ఉద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్వర్గీయ డాక్టర్‌ బాలగోపాల్‌.. పోలీసులైనా, మావోయిస్టులైనా అన్యాయంగా, అక్రమంగా హింసకు పాల్పడితే అది హింసేనని స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన బలంగా వాదించారు. మావోయిస్టుల హింసాత్మక చర్యలను కూడా బహిరంగంగా ప్రశ్నించిన బాలగోపాల్‌ వైఖరి అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనపై మావోయిస్టు నాయకత్వం నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. అప్పటి పరిణామాలు పై జర్నలిస్టు సంఘాల నాయకులు, పౌర హక్కుల వర్గాలు డాక్టర్ బాలగోపాల్ కు  బాసటగా నిలిచాయి.

మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే.. దాని హింసాత్మక వైఖరిని బహిరంగంగా ప్రశ్నించిన ధైర్యవంతమైన స్వరాల్లో బాలగోపాల్‌ది ముఖ్యమైనది. అందుకే ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న మావోయిస్టు పార్టీ తీరుపైనా, అగ్ర నాయకుల పనితీరుపైనా విశ్లేషణ చేసే క్రమంలో.. … గతంలో ఆ ఉద్యమాన్ని లోపలినుంచి, బయటినుంచి ప్రశ్నించిన స్వరాలను కూడా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.


👉  గణపతి ఏం చేశాడు ?

ఇదే అసలు ప్రశ్న అయితే.. సమాధానం కూడా అంతే విస్తృతంగా ఉండాలి పదవిలో ఉన్నారు నాయకత్వం వహించారు. సంస్థను విస్తరించారు. విలీన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. దేశంలోని 16 రాష్ట్రాలలో 150 జిల్లాల పలు ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించారు. దండకారణ్యంలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేశారు. చివరకు నాయకత్వం నుంచి తప్పుకున్నారు.

అదే సమయంలో.. ఆయన నాయకత్వ కాలంలో చోటుచేసుకున్న హింస, ప్రాణనష్టం, ప్రజలపై పడిన భారం కూడా చరిత్రలో భాగమే… కాబట్టి గణపతి పాత్రను పూర్తిగా పొగడటమో.. పూర్తిగా కొట్టిపారేయటమో కాదు. జరిగిన వాస్తవాలను వాస్తవాలుగా చెప్పడమే చరిత్రకు న్యాయం.

👉 నాలుగు దశాబ్దాల ఉద్యమాన్ని నాలుగు పేరాల్లో రాయొచ్చు…. నాలుగు దశాబ్దాల చరిత్రకు నాలుగు వాక్యాలతో తీర్పు చెప్పలేం… ఏం చేశారు?  అని అడగడం తప్పు కాదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు.. ‘ఏం జరిగింది? అనే చరిత్రను చదవాలి ….


👉
జగిత్యాల జైత్రయాత్ర నుంచి దండకారణ్యం వరకు సాగిన ప్రస్థానాన్ని పక్కనపెట్టి….. కేవలం ఒక నాయకుడి పదవీకాలాన్ని లెక్కిస్తే అది విశ్లేషణ కాదు.. చరిత్రను వక్రీకరించడం  మాత్రమే…నాలుగు దశాబ్దాల చరిత్రను.. ఒక్క ప్రశ్నతో కొలవలేం….