విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ లు ఆర్యవైశ్యులు!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,


పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా పేదల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్యవైశ్యులు సమాజంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.


👉 హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , మాజీ మంత్రి టీజీ వెంకటేష్ , పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఈ ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చూడాలని ప్రతినిధులకు సూచించారు.


👉 సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టిన మహాత్మా గాంధీ  భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా మహాత్మా గాంధీ  విగ్రహాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు  ప్రాణత్యాగాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య  అందించిన విశేషమైన సేవను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రస్తావించారు.


👉 గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరుకులు అరువుగా ఇచ్చే విషయంలో మానవతతో వ్యవహరించే ఆర్యవైశ్యులు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి  అభివర్ణించారు. ముందు చూపుతో వ్యవహరించడం, జాగ్రత్తగా ఉండటం ఆర్యవైశ్యుల డీఎన్‌ఏలోనే ఉందన్నారు.

👉 ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే బలం చేకూరుతుందని, తద్వారా రాజకీయాల్లో తమ వాటాను తామే సాధించుకోగలరని ముఖ్యమంత్రి సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు.