👉 స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే ప్రవర్తన..!
👉 దళితులపై ‘శుద్ధి’ ఘటనలపై విచారణకు విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పలు వివాదాస్పద ఘటనలపై రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు తదితరులు బుధవారం గవర్నర్‌ను కలిశారు. బీఆర్‌ఎస్ నేతల వ్యవహారశైలిపై సమగ్రంగా విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం.
👉 శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాటా మధుసూదన్, తదితరులు చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలు, మరో ఎమ్మెల్యే నవీన్‌రెడ్డి వ్యవహరించిన తీరును మంత్రులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నట్లు తెలిసింది.
👉 ఇదే క్రమంలో గవర్నర్ పట్ల జరిగిన దుష్ప్రవర్తనకు నిరసనగా మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ మార్గంలో దళిత వర్గాలు డప్పులు వాయిస్తూ నిరసన తెలిపిన ఘటనను కూడా మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం.
👉 బుధవారం బీఆర్‌ఎస్ నాయకులు దళితులు వెళ్లిన ప్రదేశాన్ని పసుపు నీటితో శుద్ధి చేశారంటూ వచ్చిన ఆరోపణలు కూడా తీవ్ర వివాదానికి దారితీశాయని మంత్రులు గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.
👉 ఈ ఘటనలు సామాజికంగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు సూచించినట్లు సమాచారం.
👉 రాజ్యాంగ పదవుల గౌరవం, దళితుల ఆత్మగౌరవం, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరించిన వారిపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని గవర్నర్‌ను మంత్రులు కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్‌ఎస్ నేతల తీరుపై తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది.
