కేసీఆర్‌ మొదటి నుంచి దళిత వ్యతిరేకి!

👉 ఎమ్మెల్సీ తాతా మధుపై చట్టపరమైన చర్యలకు డిమాండ్!


👉 అసెంబ్లీలో మంత్రి అడ్లూరి ఆగ్రహం !


J.SURENDER KUMAR,


అసెంబ్లీ సమావేశాల తొలిరోజు అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకున్న పరిణామాలు సోమవారం సభలో తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశంపై సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి, స్పీకర్‌ స్థానాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభలో డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

అంతకుముందు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని సభ దృష్టికి తీసుకురాగా, ఈ అంశంపై మాట్లాడేందుకు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు స్పీకర్‌ అవకాశం కల్పించారు.

👉 ‘కేసీఆర్‌ మొదటి నుంచీ దళిత వ్యతిరేకే’!

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ మొదటి నుంచి దళిత వ్యతిరేక వైఖరితోనే వ్యవహరించారని ఆరోపించారు. గతంలో తన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను బర్తరఫ్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే తనను ఓడించిన వ్యక్తిని సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగిస్తూ అవమానించారని మంత్రి విమర్శించారు.

మీరు స్పీకర్‌ స్థానంలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఎలా గౌరవించాలి అనే ఆలోచన కూడా లేకుండా, దళితులను అవమానించేలా దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత విమర్శలు కాదని, స్పీకర్‌ పదవి, శాసనసభ గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.


👉 మంత్రి డిమాండ్‌కు పార్టీల మద్దతు !


తాతా మధుపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్‌కు సభలోని పలువురు సభ్యులు మద్దతు తెలిపారు. ఎంఐఎం, బీజేపీతో పాటు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు కూడా తాతా మధు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాట్లాడారు.