👉 టైర్–1లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు అమలు చేసేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక !
👉 భూసేకరణ ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వానికి పంపి త్వరితగతిన ఆమోదాలు పొందాలి !
👉 టెండర్ల ప్రక్రియలో జాప్యం లేకుండా పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభించాలి !
👉 కాంట్రాక్టర్లు టెండర్లకు స్పందించేలా చర్యలు చేపట్టాలి!
👉 గోదావరి పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ !
J . SURENDER KUMAR,
త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా టైర్–1లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు అమలయ్యేలా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలకే పరిమితం కాకుండా వీలైనంత త్వరగా పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య, కమిషనర్ హనుమంతరావుతో కలిసి సోమవారం సంబంధిత జిల్లా కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
👉 ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ …….

గోదావరి పుష్కరాల కోసం టైర్–1లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి, పనులు క్షేత్రస్థాయిలో వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
👉 భూసేకరణకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే పంపించి, వాటికి త్వరగా ఆమోదాలు లభించేలా నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా అవసరమైన కార్మికులు, నిర్మాణ సామగ్రిని ముందుగానే సమీకరించాలని ఆదేశించారు.
👉 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, పనుల్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నాణ్యతతో పాటు నిర్ణీత సమయంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
👉 టెండర్లకు కాంట్రాక్టర్లు స్పందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రులతో కూడా సమన్వయం చేసుకొని పనులకు సంబంధించిన ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.
👉 టెండర్ల పేరుతో పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అంశాన్ని ముందుగానే పరిష్కరించుకొని పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.
👉 కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ…….
గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని, భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 టైర్–1లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలని, టెండర్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని ఆదేశించారు. కాంట్రాక్టర్లు టెండర్లకు స్పందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
👉 అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు తదితర ప్రక్రియలను వేగవంతం చేసి, పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. పుష్కరాల పనులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ….

గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ధర్మపురిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
👉 జగిత్యాల జిల్లాలో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల పరిధిలో 4.32 ఎకరాలు, కోటిలింగాలలో 3 ఎకరాల భూసేకరణకు సంబంధించి మొత్తం రూ.9.25 కోట్ల విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.
👉 టైర్–1 పనుల పురోగతిని వివరిస్తూ నీటిపారుదల శాఖకు సంబంధించిన పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి సెప్టెంబర్ 7న డిప్యూటీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
👉 దేవాదాయ శాఖ పరిధిలో టైర్–1 కింద మొత్తం 13 పనులకు ₹ 20 కోట్ల విలువైన పనులు ఉన్నాయని, ఇప్పటికే 8 పనులకు ఎల్‌ఓఏలు జారీ అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో టైర్–1 కింద 12 పనులకు సంబంధించి ₹ 59 కోట్ల విలువైన పనులు ఉన్నాయని, ప్రస్తుతం అవి సాంకేతిక అనుమతుల దశలో ఉన్నాయని తెలిపారు.
👉 సెప్టెంబర్ 10న టెండర్లను అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను వెంటనే ప్రారంభించేందుకు జిల్లాలో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పనులకు అవసరమైన కార్మికులు, నిర్మాణ సామగ్రిని సమీకరించి, క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి రాజా గౌడ్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
