స్పీకర్ పై దుర్భాషలాడిన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలి !

👉 అసెంబ్లీలో మంత్రి లక్ష్మణ్ కుమార్  లేవనెత్తిన అంశంపై !

👉 శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజు…

👉 శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

శాసనసభ ప్రాంగణ పరిధిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్  మాట్లాడిన విషయాన్ని అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  లేవనెత్తిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పందించారు. స్పీకర్ పై దుర్భాషలాడిన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు..

గౌరవ శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా, కించపరుస్తూ శాసనమండలి సభ్యుడు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్ రావు సభకు క్షమాపణలు చెప్పాలని కోరారు.


👉 “ఇది అత్యంత తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతి పై అంత అభ్యంతరకరమైన భాష. సభాపతిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదు. ఇది అందరికీ జరిగిన అవమానం” అని ముఖ్యమంత్రి  సభ దృష్టికి తెచ్చారు.

👉 స్పీకర్ పై అత్యంత హేయంగా దుర్భాషలాడిన సభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని శాసనమండలి చైర్మన్ ను కోరాలని చెప్పారు. “శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా మాట్లాడిన సంఘటన తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి గాయమైంది. తెలంగాణకు ఇది ఒక చీకటి రోజు. 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం” అని ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు.

👉 అడ్డగోలుగా ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకునే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. ఈ అంశం ఒక శాసనసభ్యుడికి సంబంధించిన సమస్య కాదని. రాజకీయాలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

👉 “స్పీకర్  తల్లిని అవమానించేలా మాట్లాడటం అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం. మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలి”

👉 భారతదేశ చరిత్రలో ఏ చట్టసభల్లోనూ ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన సంఘటన జరగలేదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సభ్యుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతటి దుర్మార్గమైన మాటలు ఎవరూ మాట్లాడలేదని అన్నారు.

👉 ఈ సంప్రదాయం మంచిది కాదని, దీన్ని క్షమించి ఊరుకుంటే ఇక చట్ట సభ పట్ల ఏమాత్రం గౌరవం ఉండదని హెచ్చరించారు. దుర్మార్గమైన భాష మాట్లాడటం బాధాకరమని, ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించి సమాజానికి మంచి సందేశం పంపించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  చెప్పారు.