👉 స్వామివారి సన్నిధిలో వీఐపీ హంగులకు దూరం..
👉 ముందుగా భక్తులే దర్శించుకోవాలన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ తన కోసం క్యూలైన్ ఆపొద్దని సిబ్బందికి సూచన.
👉 టికెట్ తీసుకున్న భక్తుల పూజల కోసం ఐదు నిమిషాలు వేచి చూసిన మంత్రి !
J.SURENDER KUMAR,
మంత్రి హోదా.. అధికార లాంఛనాలు.. వీఐపీ మర్యాదలు.. ఇవేవీ తనకు అవసరం లేదన్నట్లుగా స్వామివారి సన్నిధిలో తాను కూడా ఓ సాధారణ భక్తుడినేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరోసారి చాటిచెప్పారు. తన రాకతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆలయ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
సోమవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొనే కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలయానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.
👉 భక్తులను ఆపగానే.. వెంటనే స్పందన !.

మంత్రి ఆలయానికి వస్తున్న సమయంలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులను ఆలయ సిబ్బంది క్యూలైన్లో నిలిపివేశారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి వెంటనే స్పందించి “భక్తులను వదిలిపెట్టండి” అంటూ సిబ్బందికి సూచించారు. తన రాక కోసం భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నట్టుగా వారిని ముందుకు వెళ్లాలని సైగ చేశారు.
👉 టికెట్ తీసుకున్న భక్తుల తర్వాతే దర్శనం !
శ్రీ యోగా నరసింహస్వామి దర్శనానికి మంత్రి తన అనుచరులతో కలిసి అర్థమండపం వద్దకు చేరుకునే సమయానికి అప్పటికే పూజా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వేచి ఉన్నారు. మంత్రి దర్శనం పూర్తయ్యే వరకు భక్తులను నిలిపివేయాలని సిబ్బంది ప్రయత్నించగా.. మంత్రి అందుకు అంగీకరించలేదు.

“ముందుగా టికెట్ తీసుకున్న భక్తులకు పూజలు చేయించండి. వారి తర్వాత నేను స్వామివారిని దర్శించుకుంటాను” అని స్పష్టం చేశారు. దీంతో భక్తులు పూజలు పూర్తి చేసుకునే వరకు సుమారు ఐదు నిమిషాల పాటు మంత్రి స్వయంగా వేచి ఉండి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
👉 వీఐపీ స్వాగతాలకు కూడా నో !

స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ తనకు ప్రత్యేక స్వాగతాలు, పూలమాలలు, పూర్ణకుంభ స్వాగతాలు, భాజా భజంత్రీలతో హంగామా చేయవద్దని మంత్రి గతంలోనే ఆలయ అధికారులకు స్పష్టం చేశారు. తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించడంతో ఆలయ అధికారులు కూడా ఆ విధమైన స్వాగతాలకు స్వస్తి పలికారు.
👉 మంత్రి కాదు.. భక్తుడిలా !

అధికార హోదాలో ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణంలో సాధారణ భక్తుడిలా వ్యవహరిస్తూ.. తనకంటే ముందుగా వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, తన రాకతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడడం ప్రస్తుతం ధర్మపురి ఆలయానికి వచ్చిన భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. “హోదా ఎంత పెద్దదైనా.. దేవుడి ముందు అందరూ భక్తులే” అన్నట్లుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యవహరించిన తీరును భక్తులు అభినందిస్తున్నారు.
