నేడు రేపు ఓటరు జాబితాల ప్రత్యేక ప్రచార కార్యక్రమం !

👉 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి !

👉  కలెక్టర్ సత్య ప్రసాద్ !


J.SURENDER KUMAR,

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, 01.10.2026 అర్హత తేదీగా చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల స్వీకరణకు రెండో విడత ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12 (శనివారం), 13 (ఆదివారం) తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.

👉 జగిత్యాల జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLOs) రెండు రోజులూ తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లను పరిశీలించుకోవాలని సూచించారు.

👉 కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6, ఓటరు జాబితాలోని పేరుపై అభ్యంతరం లేదా తొలగింపు కోసం ఫారం-7, వివరాల సవరణ లేదా చిరునామా మార్పు కోసం ఫారం-8 సమర్పించవచ్చని తెలిపారు.

👉 సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) కూడా ప్రత్యేక ప్రచార రోజుల్లో పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. BLOలు, BLAల సమక్షంలో ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, అవసరమైన సవరణలను గుర్తించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

👉 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత, ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్లు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.