👉 పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం
👉 3,475 రోజుల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పులు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తూనే.. 1,000 రోజుల్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట !
👉 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి !
👉 హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతాల్లోనే పేదలకు ఇందిరమ్మ టవర్స్ !
👉 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ !
J.SURENDER KUMAR,
పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వంగా, గత ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇందిరమ్మ ప్రజా పాలనకు దొరల పాలనకు తేడా ఇదే అంటూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గణాంకాలతో వివరించారు..
బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
👉 గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 3,475 రోజుల పాటు రాష్ట్రాన్ని పాలించి భారీగా అప్పుల భారాన్ని మోపిందని మంత్రి విమర్శించారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని ఎక్కడా కుంటుపడనివ్వకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లించడంతో పాటు పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తూ, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.

👉 రైతు సంక్షేమానికి ₹.1.76 లక్షల కోట్లు
రైతును రాజును చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంటలకు ప్రోత్సాహకాలు తదితర కార్యక్రమాల ద్వారా గత 1,000 రోజుల్లో సుమారు రూ.1.76 లక్షల కోట్లను రైతు సంక్షేమానికి వెచ్చించినట్లు వెల్లడించారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
👉 ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం!
గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకల కారణంగా నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
👉 పేద పిల్లలకు మెరుగైన విద్య!
పేద పిల్లలు కూడా ధనిక పిల్లలతో సమానంగా పోటీ పడేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుతో పాటు విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
👉 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు!
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం ₹5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. నాలుగు విడతల్లో నిధులు చెల్లిస్తున్నామని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.
కులం, మతం, పార్టీ, రాజకీయ అనుబంధం చూడకుండా కేవలం అర్హత ఆధారంగానే ఇళ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
👉 ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇందిరమ్మ టవర్స్!
హైదరాబాద్‌లో ఇల్లు, ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఇళ్లు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఎకరం ₹100 కోట్లు, ₹200 కోట్లు, ₹300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లో కూడా పేదవాడికి ఇల్లు ఉండాలన్నారు. పేదవాడు తలెత్తుకుని గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని 20 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
👉 మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో స్థలాలను
గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని, మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 480 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపట్టి, అదనంగా 20 శాతం ఇళ్లను కలుపుకుని మొత్తం సుమారు 600 ఇళ్లను ప్రణాళికలో ఉంచినట్లు తెలిపారు.
👉 ఆడబిడ్డ పేరుతో ఇంటి రిజిస్ట్రేషన్ !
ఇందిరమ్మ టవర్స్‌లో అర్హులైన లబ్ధిదారులను పారదర్శక లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో, భూమిలో అన్‌డివైడెడ్ షేర్‌తో కూడిన ఇంటిని లబ్ధిదారురాలి పేరుతో రిజిస్టర్ చేస్తామని చెప్పారు.
“ఆడబిడ్డ పేరుతో ఇల్లు.. ఆమెకు ఆస్తి హక్కు.. ఆమె కుటుంబానికి భద్రత.. ఇదే ఇందిరమ్మ టవర్స్ ఉద్దేశం” అని మంత్రి పేర్కొన్నారు.
ఇళ్ల కేటాయింపులో ఎలాంటి పైరవీలు, డబ్బు, రాజకీయ సిఫారసులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. లక్కీ డ్రాలో పేరు వచ్చిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నివాస పరిస్థితిని పరిశీలించి అర్హతను నిర్ధారించిన తర్వాత తుది ధ్రువీకరణ చేస్తారని తెలిపారు.
👉 నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ టవర్స్
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ఒక్కసారి చేపట్టే కార్యక్రమం కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి తెలిపారు. మొదటి దశను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.
పేదవాడికి ఇల్లు ఇవ్వడం ఖర్చు కాదని.. ఆత్మగౌరవానికి పెట్టుబడి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వదిలిన అప్పులను చెల్లిస్తూ, పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తూ, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ, రైతులకు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు మెరుగైన విద్య, పేదలకు సొంత ఇళ్లు కల్పిస్తున్నామని తెలిపారు.
