👉 ₹ 50 వేల ఆర్థిక సాయం, పిల్లల చదువుకు భరోసా, భార్యకు ఉద్యోగం కోసం చర్యలు !
👉 ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుటుంబానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ అండ !
J.SURENDER KUMAR,
రాజకీయాలు వేరు.. మానవత్వం వేరు అన్న సందేశాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన స్పందనతో చాటుకున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకుడి కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. ప్రస్తుతం రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు సహజమే. అయితే ఒక కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఆ రాజకీయ భేదాలను పక్కనపెట్టి మానవీయంగా స్పందించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి కుటుంబం అయినప్పటికీ.. రాజకీయ కోణంలో చూడకుండా కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలవడం మంత్రి లక్ష్మణ్ కుమార్ మానవీయతకు నిదర్శనంగా నిలిచింది. పార్టీ జెండాలు, రాజకీయ విభేదాలకు అతీతంగా బాధిత కుటుంబం కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి….
ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ ఆర్థిక ఇబ్బందులతో గత రెండు రోజుల క్రితం బలవన్మరణం చెందారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం వినాయక చవితి రోజున గుల్లకోట గ్రామానికి వెళ్లి జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తనవంతుగా ₹ 50 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరు చిన్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మృతుడి భార్యకు అర్హత మేరకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లల చదువుకు అండగా ఉంటామని, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని మంత్రి భరోసా కల్పించారు.

మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, ఎండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు జల్లిశేఖర్, నాయకులు పొన్నం మల్లేశ్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఉన్నారు.
