ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట!

👉విద్య నుంచి ఉపాధి వరకు భవిష్యత్తుకు బాటలు !

👉 నవంబర్‌ 19 నుంచి ‘రాజీవ్‌ యువ వికాసం’ తొలి విడత సాయం.!

👉 గురుకులాల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం.. ఆధునిక వంటశాలలపై ప్రత్యేక దృష్టి !

👉 డిప్యూటీ సీఎం భట్టి , మంత్రి అడ్లూరి..!


J.SURENDER KUMAR,


ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమాన్ని కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా.. విద్య, నైపుణ్యం, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేద, బహుజన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు గురుకులాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, స్కాలర్‌షిప్‌లు, స్టడీ సర్కిళ్లు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

👉 యువతకు స్వయం ఉపాధి.. ‘రాజీవ్‌ యువ వికాసం’!

ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం కింద నవంబర్‌ 19 నుంచి తొలి విడత ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

₹ లక్షలోపు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో యూనిట్లు మంజూరు చేయాలని, దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు.

👉 గురుకులాల్లో ‘మెకనైజ్డ్‌ కిచెన్లు…!

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సమీక్షలో స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలల ఏర్పాటును వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.

ఆధునిక వంటశాలలు, యంత్రాల కొనుగోలుకు ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే 15 రోజుల్లో మెకనైజ్డ్‌ కిచెన్ల ఏర్పాటుపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు.

👉 గురుకులాల ‘ఫలితాల’పై ఫోకస్‌.. !

గురుకులాల్లో చదివిన విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. గత పదేళ్లలో వివిధ సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమగ్ర డేటాబేస్‌ రూపొందించాలని ఆదేశించారు.
ఎంతమంది ఉన్నత విద్యలో స్థిరపడ్డారు? ఎంతమంది ఉద్యోగాలు సాధించారు? ఎవరైనా ఆర్థిక, సామాజిక కారణాలతో చదువు మధ్యలోనే నిలిపివేశారా? అనే అంశాలను అధ్యయనం చేయనున్నారు.

గురుకుల విద్య వల్ల విద్యార్థుల జీవితాల్లో వచ్చిన మార్పులను అంచనా వేసేందుకు **సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (CESS)**తో సమగ్ర అధ్యయనం చేయించాలని నిర్ణయించారు.

👉 చదువుతోపాటు ఉద్యోగానికి దారి….!

సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 30 డిగ్రీ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టే అంశాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆయా కోర్సులను స్కిల్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలని సూచించారు.

అంటే.. విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూడటం కాకుండా, చదువుతున్నప్పుడే ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించేలా విద్యా విధానాన్ని మార్చే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

👉 స్టడీ సర్కిళ్లపై సమీక్ష…!

ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అందుతున్న శిక్షణ, ఖర్చు, ఫలితాలపై కూడా సమీక్ష జరిగింది. ప్రభుత్వ పెట్టుబడికి అనుగుణంగా అభ్యర్థులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతోందనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.

నాణ్యమైన కోచింగ్‌, మెరుగైన అధ్యయన వాతావరణంతో పాటు శిక్షణ అనంతరం అభ్యర్థులు సాధిస్తున్న ఫలితాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

👉 విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం…..!

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, భద్రత, పారిశుధ్యం, మెరుగైన మౌలిక వసతులు అందేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు.
గురుకులాలను కేవలం చదువు చెప్పే సంస్థలుగా కాకుండా.. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి అవకాశాలను కోల్పోకుండా ఉన్నత విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి వారిని సిద్ధం చేయాలని సూచించారు.

👉 గిరిజన విద్యకు మరింత బలం…!

గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ ఆధ్వర్యంలో 26 ఏకలవ్య పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు సమావేశంలో తెలిపారు.
గిరిజన విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందేలా పాఠశాలల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.