👉 బ్యాండ్ మేళానికి అనుగుణంగా నృత్యం.. క్యాడర్‌లో ఉత్సాహం !
👉 మంత్రి తనయుడు హరీశ్వర్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణుల సందడి!
J.SURENDER KUMAR,
శాసనసభ సమావేశాలు, సమీక్ష సమావేశాలు, ప్రోటోకాల్ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. వినాయక నిమజ్జనం సందర్భంగా మాత్రం తనలోని ఉత్సాహాన్ని చాటుకున్నారు. బ్యాండ్ మేళాలకు అనుగుణంగా తీన్మార్ స్టెప్పులు వేస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు.

ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.

మంత్రి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఆయన తనయుడు హరీశ్వర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణ, బ్యాండ్ మేళాల నడుమ ధర్మపురి పట్టణ పురవీధుల గుండా ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ తలపై సంప్రదాయ పగిడి ధరించి బ్యాండ్ మేళానికి అనుగుణంగా నృత్యం చేయడంతో శోభాయాత్రలో పాల్గొన్న వారిలో ఉత్సాహం మరింత పెరిగింది. మంత్రి తనయుడు హరీశ్వర్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా నృత్యాలతో సందడి చేశారు.

అనంతరం భక్తుల కోలాహలం, గణనాథుని నామస్మరణల మధ్య శోభాయాత్ర గోదావరి నది తీరానికి చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

