అధికారుల పదోన్నతులకు మార్గం సుగమం !

👉 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అధికారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ చొరవ..!


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చొరవ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన TADA…!


J.SURENDER KUMAR,


వ్యవసాయ శాఖలో అర్హులైన అధికారుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ (TADA) స్వాగతించింది.

ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అధికారులకు న్యాయం జరిగేలా సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు TADA ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో ఉద్యోగుల పదోన్నతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక చొరవ తీసుకొని స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కృషి అభినందనీయమని TADA పేర్కొంది.

ఉద్యోగుల న్యాయమైన హక్కులు, సామాజిక న్యాయం, రిజర్వేషన్‌ సూత్రాలకు అనుగుణంగా పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచాయని తెలిపింది.

👉 మంత్రి అడ్లూరి ప్రత్యేక చొరవ..!

వ్యవసాయ అధికారుల పదోన్నతులకు సంబంధించిన మెరిట్‌ వర్సెస్‌ రోస్టర్‌ సీనియారిటీ కేసులో హైకోర్టు విధించిన స్టే కారణంగా పదోన్నతుల ప్రక్రియకు ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని TADA ప్రతినిధులు తెలిపారు.

ఈ కేసు ఒక్క వ్యవసాయ శాఖకు మాత్రమే పరిమితం కాకుండా, దీని పర్యవసానాలు ఇతర ప్రభుత్వ శాఖల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఉద్యోగుల పదోన్నతులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి గుర్తించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్‌ జనరల్‌, న్యాయశాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, సమస్య పరిష్కారానికి అవసరమైన సమన్వయం కోసం కృషి చేశారని తెలిపారు.

న్యాయపరమైన అంశాలపై ఉన్నతస్థాయిలో సమన్వయం చేస్తూ, ఈ కేసు ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మంత్రి అడ్లూరి చూపిన చొరవ అభినందనీయమని TADA పేర్కొంది.

👉 పదోన్నతుల ప్రక్రియకు ఊతం..!

హైకోర్టులో స్టే ఎత్తివేయడంతో వ్యవసాయ అధికారుల పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైందని TADA సంతృప్తి వ్యక్తం చేసింది. అర్హత, సీనియారిటీ, రోస్టర్‌, నిబంధనలు, సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించడం ద్వారా ఉద్యోగుల్లో న్యాయబద్ధతపై నమ్మకం మరింత బలపడుతుందని పేర్కొంది.

పదోన్నతి అనేది కేవలం ఉద్యోగపరమైన హోదా మార్పు మాత్రమే కాదని, అది ఉద్యోగి ఆత్మగౌరవం, సేవా ప్రగతి, భవిష్యత్‌ అవకాశాలు, పరిపాలనలో సమర్థవంతమైన భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న అంశమని TADA తెలిపింది. అర్హులైన ఏ ఒక్క అధికారికి అన్యాయం జరగకుండా, నిబంధనల ప్రకారం మిగిలిన పదోన్నతుల ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

👉 మంత్రి అడ్లూరికి ఘన సన్మానం…,!

ఈ సందర్భంగా తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధులతో పాటు కరీంనగర్‌, మంచిర్యాల, సిద్దిపేట, జగిత్యాల, నిర్మల్‌, మెదక్‌, సిరిసిల్ల జిల్లాలకు చెందిన TADA ప్రతినిధులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి ఘనంగా సన్మానించారు.

వ్యవసాయ అధికారుల పదోన్నతుల సమస్య పరిష్కారానికి మంత్రి చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యను సానుకూల దృక్పథంతో స్వీకరించి, ఉన్నతస్థాయిలో సమన్వయం చేస్తూ పరిష్కారానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన పదోన్నతుల ప్రక్రియ కూడా నిబంధనల ప్రకారం సజావుగా పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో TADA రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్‌ నాయక్‌, జనరల్‌ సెక్రటరీ జె. తిరుపతి నాయక్‌, ట్రెజరర్‌ మధుమోహన్‌, జగిత్యాల DAO భాస్కర్‌, ADA రామచందర్‌, నిశాంత్‌, అనిల్‌, అంజిత్‌, ఖాదర్‌, తిరుమల్‌, సురేందర్‌, పరశురాం రెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.