👉 గ్రామం మొత్తానికి భూసేకరణ.. పునరావాసం కల్పిస్తాం!
👉 సీఎం హామీతో కదిలిన యంత్రాంగం.. 7 రోజుల్లో సర్వే పూర్తి.!
👉 8 ప్రత్యేక బృందాలతో సామాజిక ప్రభావ అంచనా !
👉 3 నుంచి 4 నెలల్లో పరిహారం, పునరావాస ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు.!
👉 గత పాలకుల గాలి మాటలు కాదు.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. !
J.SURENDER KUMAR,
ఏళ్ల తరబడి ముంపు కష్టాలతో సతమతమవుతున్న చమనపల్లి గ్రామ ప్రజలకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. భారీ వర్షాలు, నీటిని ఎత్తిపోసే సమయంలో ముంపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టి, పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ అమలు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఎన్నో ఏళ్లుగా ముంపు సమస్యతో ఆందోళన చెందుతున్న గ్రామస్తుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
👉 గ్రామసభలో భరోసా.. బాధితులకు నమ్మకం !

మంగళవారం ధర్మారం మండలం చమనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నిర్వహించిన గ్రామసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను, వారి ఇబ్బందులను మంత్రి స్వయంగా తెలుసుకున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
సాధారణంగా పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) నుంచి 100 మీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, చమనపల్లి ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఆ పరిమితికి మించి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
👉 7 రోజుల్లో సర్వే పూర్తి.. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు !
భూసేకరణ ప్రక్రియలో భాగంగా సామాజిక ప్రభావ అంచనా సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామంలోని ప్రతి ఇంటి నిర్మాణం, చెట్లు, బావులు, ఇతర ఆస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా సమగ్ర వివరాలతో అంచనాలు రూపొందించాలని స్పష్టం చేశారు.
భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియను 3 నుంచి 4 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
👉 సీఎం హామీతో కార్యరూపంలోకి..!
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా సూచించారని మంత్రి పేర్కొన్నారు. చమనపల్లి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోందని, దీనిని విజయవంతం చేసేందుకు గ్రామ ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు.
👉 గాలి మాటలు కాదు.. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం !
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

“మేము గత ప్రభుత్వం పాలకుల మాదిరిగా ఏదో గాలి మాటలు చెప్పి వెళ్లిపోయే రకం కాదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. చమనపల్లి గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది” అని స్పష్టం చేశారు.
గ్రామ ప్రజలతో తనకు సుమారు 25 సంవత్సరాల అనుబంధం ఉందని, 2006లో ధర్మారం మండలం నుంచి జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు, సమస్యలు తనకు తెలుసునని పేర్కొన్నారు.
👉 రాజకీయాలకు అతీతంగా.. మానవతా దృక్పథంతో !
భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియలో చిన్న చిన్న సమస్యలు ఎదురైతే వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజలకు భూసేకరణ, ఆర్అండ్ఆర్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయాలని, భూసేకరణ, పరిహారం, పునరావాసం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
👉 బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా..!

చమనపల్లి గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ నిర్ణయం బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఇప్పటివరకు ముంపు భయంతో ఆందోళన చెందిన గ్రామస్తులకు భూసేకరణ, పరిహారం, పునరావాసం ద్వారా భద్రమైన భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
హామీ నుంచి అమలు దిశగా సాగుతున్న ఈ ప్రక్రియ.. చమనపల్లి గ్రామ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
