👉 ఎస్. ఐ.ఆర్. లో ప్రతి అంశాన్ని పారదర్శకంగా, పక్కాగా నమోదు చేయాలి !
👉 అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి!
👉 పెండింగ్లో ఉన్న నోటీసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలి !
👉 భౌతిక, ఆన్లైన్ రికార్డులు, ఆధారాలను భద్రంగా నిర్వహించాలి !
👉 జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి !
J. SURENDER KUMAR ,
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,….

ఎస్.ఐ.ఆర్. ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా, పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అడిగిన వెంటనే వివరాలు అందించేందుకు అవసరమైన రికార్డులు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లను చేర్చడానికి లేదా తొలగించడానికి సంబంధించి తగిన ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలను తప్పనిసరిగా భద్రపరచాలని తెలిపారు.
👉 ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలి ఉన్న సుమారు 4.50 లక్షల పెండింగ్ పనులను రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో, ఈ వారం చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఎస్.ఐ.ఆర్. నోటీసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని ఆదేశించారు.
👉 అనర్హులుగా గుర్తించిన దరఖాస్తులకు సంబంధించి సరైన కారణాలు, తగిన డాక్యుమెంట్లు, ఆధారాలను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించగా, వాటిలో 44 వేల దరఖాస్తుల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనర్హతకు సంబంధించిన ఆధారాలను రాజకీయ పార్టీలు, ఆర్టీఐ దరఖాస్తుదారులు లేదా ఇతరులు కోరినప్పుడు అందించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
👉 ఫారం-6 దరఖాస్తుల పరిశీలనతో పాటు పెండింగ్ పనులను నవంబర్ 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారం-7కు సంబంధించిన పెండింగ్ పనులను కూడా అదే గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఆధారాలను సక్రమంగా భద్రపరచాలని తెలిపారు.

👉 ఎన్నికల ప్రక్రియలో ఎల్.ఓ., ఏ.ఎల్.ఓ., ఈ.ఆర్.ఓ., బి.ఎల్.ఓ. స్థాయిల్లో అన్ని రికార్డులు, డాక్యుమెంట్లను భౌతికంగా, ఆన్లైన్లో భద్రంగా నిర్వహించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఏవైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తినా, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వచ్చినా వెంటనే అవసరమైన సమాచారం, ఆధారాలు అందించేలా రికార్డుల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హుల పేర్ల తొలగింపునకు సంబంధించి నిబంధనల ప్రకారం తగిన ఆధారాలు ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
👉 వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్ జిల్లాలో ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో పెండింగ్లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్ నోటీసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సేకరించి, సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.
👉 ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను భౌతికంగా, ఆన్లైన్లో భద్రపరచాలని, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినప్పుడు లేదా న్యాయపరమైన అవసరాలు ఏర్పడినప్పుడు వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ప్రసునంభా, ఈ.ఆర్. ఓ.లు, ఏ.ఈ.ఆర్.ఓ.లు, సంబంధిత ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
