హైదరాబాద్ అభివృద్ధిలో ఓ ఆర్ ఆర్ కీలక పాత్ర !

👉 సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో….

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…!

J SURENDER KUMAR,


హైదరాబాద్ అభివృద్ధిలో ఓఆర్‌ఆర్ కీలక పాత్ర పోషించింది,  మెరుగైన రవాణా అనుసంధానంతో ఐటీ, ఫార్మా, విద్య, సర్వీస్ రంగాలు విస్తరించి నగరం నాలెడ్జ్ హబ్‌గా ఎదిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే తరహాలో ఓఆర్‌ఆర్‌కు వెలుపల సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (RRR) అభివృద్ధి చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా యువత, మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


👉 సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో  హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ప్రసంగించారు. కొత్త తరాన్ని అభివృద్ధివైపు నడిపించాలన్న ఆలోచనలతో పనిచేస్తోందంటూ సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

👉 ఈ సదస్సులో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,….

రకరకాల ఆలోచనలు, ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న నూతన విధానాలను సంపూర్ణంగా యువత తరానికి అందించాలంటే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలను కూడా అవగాహన కల్పించుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.

👉 తెలంగాణ రైజింగ్ 2047 లో నిర్దేశించిన ప్రణాళికలోని పెరి అర్బన్ రీజియన్‌లో స్టార్టప్‌లు, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో యువ పారిశ్రామికవేత్తలు ఈ అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

👉 “యువతకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, నూతన విధానాలు, చట్టాలపై అవగాహన కల్పించడంలో సమాఖ్యలు, చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించే సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకే వేదికపై వివిధ రంగాల అనుభవజ్ఞులను కలుసుకోవడం, వారి ఆలోచనలు, అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

👉 కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పారిశ్రామిక, రాజకీయ, న్యాయ, సినీ రంగాల్లో సాధించిన విజయాలను నమోదు చేసి భవిష్యత్ తరాలకు అందించడం ద్వారా యువతకు స్ఫూర్తినివ్వవచ్చు.

👉 భారతదేశానికి 2047 అత్యంత ప్రాధాన్యత కలిగిన సంవత్సరం. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశం సాధించిన ప్రగతిని సమీక్షించుకోవడంతో పాటు, భవిష్యత్ లక్ష్యాల సాధనకు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలి.

👉 భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

👉 తెలంగాణ ప్రభుత్వం 2025లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి, రాష్ట్ర అభివృద్ధికి నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించడంతో పాటు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ ఆర్థిక విభాగాలుగా విభజించి, ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, జనాభా, వనరులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం.

👉 ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 1.34 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్ అర్బన్ రీజియన్‌ CURE ను గుర్తించాం. హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటి ప్రాంతానికి తరలించి నగరంలో సర్వీస్ సెక్టార్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం.

👉 ఈ ప్రాంతంలోని కాలుష్యకారక పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రాయితీలు, అనుమతులు, ఇతర సహకారం అందించాలనే ఉద్దేశంతో హిల్ట్ పాలసీని తీసుకొచ్చాం. పరిశ్రమల తరలింపు ప్రక్రియలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందిస్తున్నాం.

👉 ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యనున్న సుమారు 10,500 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) గా గుర్తించి, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం యువ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు గొప్ప అవకాశాలను అందిస్తుంది.

👉 రీజినల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించాం.

👉 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రణాళికలతో పాటు వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ, పెట్టుబడులు ఎంతో కీలకం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.

👉 ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీపడే స్థాయికి హైదరాబాద్‌ను తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థల్లో సేవలు అందించే వారిలో భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంతవరకే పరిమితం కాకుండా మనవాళ్లు సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.

👉 ప్రపంచవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం పెరిగిన దేశాలు ఆర్థికంగా పురోగమిస్తున్నాయి. భారతదేశంలోనూ మహిళల పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది.

👉 యువత, మహిళలకు సమానంగా అవకాశాలు కల్పించడం ద్వారా పారిశ్రామిక రంగంలో రాష్ట్రం మరింత పురోగతి సాధించగలదు” అని ముఖ్యమంత్రి  నొక్కి చెప్పారు.

👉 రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు , ఎంపీలు డాక్టర్ కె లక్ష్మణ్ , వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.