విజయలక్ష్మికి ఉత్తమ మహిళా రైతు అవార్డు!


👉 అవార్డును ప్రధానం చేసిన మంత్రి  లక్ష్మణ్ కుమార్..!


J SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం సాలేపల్లి గ్రామానికి చెందిన కటకం విజయలక్ష్మి  జిల్లా ఉత్తమ మహిళా రైతు అవార్డు కు ఎంపికయ్యారు. రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. 


👉 వివరాలు ఇలా ఉన్నాయి..


జగిత్యాల జిల్లాలో పొలస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నందు బుధవారం జరిగిన  కిసాన్ మేళా దివాస్ -2026 సందర్భంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సుస్థిర సాగులో విజయలక్ష్మి ప్రతిభకు గుర్తింపుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా రైతుగా ఎంపిక చేసి మంత్రి ద్వారా అవార్డు ప్రధానం చేశారు.

విజయలక్ష్మి తన వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల కూరగాయలను సాగు చేయడంతో పాటు వరి పంటను కూడా పండిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఆవును పెంచుకుంటూ, పశువుల నుంచి లభించే వనరులను ఉపయోగించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను కూడా పాటిస్తున్నారు.

ఆధునిక వ్యవసాయ సాంకేతికతను, శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ, పంటల దిగుబడిని పెంచడం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, సాగులో లాభదాయకతను పెంపొందించడం వంటి అంశాల్లో ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

👉 అధికారుల సూచనలతో.. అవార్డు గ్రహీత..!

వ్యవసాయ అధికారి రాజ్ కుమార్, విస్తరణ అధికారి నవ్య మేడం ఇస్తున్న సలహాలు సూచనలతో  తాను వివిధ సాగు పద్ధతులను పాటిస్తున్నట్లు అవార్డు గ్రహీత విజయలక్ష్మి తన ప్రసంగంలో తెలిపారు.


ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ , ధర్మపురి వ్యవసాయ సహాయ సంచాలకులు రాoచందర్  అనుబంధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా రైతుగా వ్యవసాయ రంగంలో విజయలక్ష్మి సాధించిన ఈ గుర్తింపు పట్ల స్థానిక రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.