హైద‌రాబాద్‌లో తాగునీటి సమస్య రావద్దు!

👉 అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి !


J. SURENDER KUMAR,


రాజధాని హైద‌రాబాద్‌ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌ని చెప్పారు.

👉 క్యూర్ పరిధిలో మంచినీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్‌హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్‌లో మంగళవారం ముఖ్య‌మంత్రి  స‌మీక్ష నిర్వ‌హించారు. ఎల్‌నినో నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ప్రాంత పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాల‌ని ఆదేశించారు.

👉 సెక్ర‌టేరియ‌ట్‌తో పాటు సీఎంఓ, అవుట‌ర్ రింగ్, మెట్రో రైల్, ఇత‌ర శాఖ‌ల‌ కార్యాల‌యాల్లో పచ్చదనం నిర్వహణ కోసం, ఇత‌ర అవ‌స‌రాల‌కు శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చూడాల‌ని తెలిపారు. ప‌బ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్ర‌తకు కూడా ట్రీటెడ్ వాట‌ర్‌నే వాడాలన్నారు.

👉 భ‌వ‌న నిర్మాణంలో శుద్ధి చేసిన నీటినే వాడాల‌నే నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ముఖ్యమంత్రి  స్ప‌ష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను ప‌రిశీలించాల‌ని రెడ్కో ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

👉 ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాలు పాటించాల‌ని చెప్పారు. నీటి నాణ్యత విష‌యంలో ఏ మాత్రం రాజీ ప‌డొద్దన్నారు. ప్రతి నీటిశుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

👉 ఈ కేంద్రాల పనితీరును ఎప్ప‌టికప్పుడు హైడ్రా పర్యవేక్షించాల‌ని చెప్పారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

👉 ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి  ఆదేశించారు.

👉 ప్ర‌స్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాట‌ర్‌ను గ్రీన్ ట్యాంక‌ర్స్ ద్వారా పంపిణీ చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు వివరించారు. వినియోగ‌దారుల నుంచి కేవ‌లం ర‌వాణా రుసుం మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నామ‌ని, నీటిని ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలిపారు.

👉 ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.