👉 హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న సమ్మిట్ !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు
👉 ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించే కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు..
👉 గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
👉 గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ ప్రతిష్ఠ ప్రపంచస్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
👉 టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ రంగాల ప్రముఖులు, అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు
👉 క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు చెందిన ప్రపంచస్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని చెప్పారు. AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు.
👉 తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో డిజైన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు.
👉 బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యేకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
