3 నెలలో ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదా!

👉విద్యార్థుల హక్కులకు చట్టబద్ధ రక్షణ దిశగా తెలంగాణ సర్కార్ కీలక అడుగు !

👉 భట్టి విక్రమార్క ఆదేశాలు.. ముసాయిదా రూపకల్పనకు ఎస్సీ అభివృద్ధి శాఖ నేతృత్వం !

👉 వివక్షకు అడ్డుకట్ట.. సమాన అవకాశాలే లక్ష్యం !

👉 న్యాయ, విద్యా, హోంశాఖలతో పాటు నల్సార్ సహకారం !

👉 హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ !

J.SURENDER KUMAR,

విద్యార్థుల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ భరోసా.. ఉన్నత విద్యాసంస్థల్లో కుల, సామాజిక వివక్షకు అడ్డుకట్ట! ఈ లక్ష్యాలతో ప్రతిపాదిత ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేసింది. బిల్లుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను మూడు నెలల్లోగా సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ (CSC)కి సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను నిరోధించడం, ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ ప్రతిపాదిత చట్టంలోని కీలక లక్ష్యాలుగా నిలవనున్నాయి.

👉 మూడు నెలల్లో ముసాయిదా.. అధికారులకు స్పష్టమైన గడువు!

రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. బిల్లు రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, న్యాయపరమైన అంశాలు, సంబంధిత శాఖల భాగస్వామ్యం, వివిధ వర్గాలతో సంప్రదింపులపై విస్తృతంగా చర్చించారు.
నిర్దేశిత గడువులో ముసాయిదా సిద్ధమయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిల్లు తయారీ ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా, ప్రతి దశను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

👉 ఎస్సీ అభివృద్ధి శాఖకు కీలక బాధ్యత…!

ప్రతిపాదిత బిల్లు రూపకల్పనలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (SCDD) ప్రధాన సమన్వయ బాధ్యతలు చేపట్టనుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నేతృత్వంలోని ఈ శాఖ, సంబంధిత ప్రభుత్వ విభాగాలు, న్యాయ నిపుణులు, విద్యా రంగ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముసాయిదా తయారీకి అవసరమైన కసరత్తును చేపట్టనుంది.

విద్యార్థుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన, విద్యాసంస్థల్లో వివక్ష నిరోధం వంటి అంశాలను చట్టపరంగా బలోపేతం చేసేలా ముసాయిదాను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

👉 కాగితాలకే పరిమితం కాకూడదు.. అమలుకు పటిష్ట వ్యవస్థ !

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఆచరణ సాధ్యమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరాన్ని సమావేశం గుర్తించింది. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను సమర్థంగా పరిష్కరించే వ్యవస్థలు ఉండాలని చర్చించారు.
చట్టం కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ ప్రభావవంతంగా అమలయ్యేలా తగిన యంత్రాంగాన్ని ముసాయిదాలో పొందుపరచాలని నిర్ణయించారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా వెల్లడించగలగడం, ఫిర్యాదులపై న్యాయబద్ధమైన చర్యలు తీసుకునే విధానం ఉండడం వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

👉 న్యాయ నిపుణులు, నల్సార్ సహకారం !

బిల్లు రూపకల్పనలో న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు న్యాయశాఖను కమిటీ సభ్య శాఖగా చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యాశాఖ, హోంశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తదితర సంబంధిత సంస్థల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు.

నిబంధనల రూపకల్పనలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన, సాంకేతిక అంశాల్లో సహకరించేందుకు నల్సార్ అంగీకరించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి వివరించారు. న్యాయ, విద్యా రంగ నిపుణుల సూచనలతో సమగ్ర ముసాయిదాను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

👉విద్యార్థులు, అధ్యాపకులతో సంప్రదింపులు..!

బిల్లు రూపకల్పనకు ముందు విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, విద్యా రంగ నిపుణులు, పౌర సమాజ సంస్థలు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా సంబంధిత వర్గాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.

ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షకు సంబంధించిన అంశాలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఉన్న లోపాలు, చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి ముసాయిదాలో తగిన నిబంధనలు పొందుపరచనున్నారు.

👉సామాజిక న్యాయం దిశగా కీలక కసరత్తు..!

విద్య అనేది ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన వేదిక. అలాంటి విద్యాసంస్థల్లో కులం లేదా సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్ష ఎదురైతే, దానిని నిరోధించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన రక్షణ అవసరం. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు రూపకల్పనకు ప్రభుత్వం గడువు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మూడు నెలల్లో ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీకి సమర్పించాలన్న ఆదేశాల నేపథ్యంలో, సంబంధిత శాఖల సమన్వయం, నిపుణుల సలహాలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు ఈ ప్రక్రియలో కీలకం కానున్నాయి. ప్రతిపాదిత బిల్లు తుది రూపం దాల్చి చట్టంగా మారితే, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎలాంటి వ్యవస్థలు ఏర్పడతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐఏఎస్ అధికారులు యోగితా రాణా, విజయేంద్ర బోయి, న్యాయవాది దిశా వడేకర్ తదితరులు పాల్గొన్నారు.