ఏపీ డిప్యూటీ సీఎం వైవాహిక బంధానికి ముగింపు !

👉 పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల విడిపోవాలని నిర్ణయం!


👉 పరస్పర అవగాహన.. పరస్పర గౌరవంతో కీలక నిర్ణయం,!


👉 పిల్లల భవిష్యత్తే తమ ఉమ్మడి ప్రాధాన్యత అని స్పష్టీకరణ!


👉 వ్యక్తిగత జీవితంలో మార్పు.. గోప్యతకు గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి!


J.SURENDER KUMAR,

సినీ రంగంలో తిరుగులేని అభిమానగణం.. రాజకీయాల్లో కీలక బాధ్యతలు.. ప్రజా జీవితంలో నిరంతరం వార్తల్లో నిలిచే వ్యక్తిత్వం. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 13 ఏళ్ల వైవాహిక బంధం అనంతరం తన భార్య అన్నా కొణిదెలతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అవగాహన, గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

2013లో వివాహ బంధంతో ఒక్కటైన పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల.. తమ జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కలిసి పంచుకున్న తర్వాత ఇప్పుడు వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు.

👉 పిల్లల శ్రేయస్సే ప్రథమ ప్రాధాన్యత!

విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని, పిల్లల పట్ల బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. తమ పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు ఎప్పటికీ తమ ఉమ్మడి ప్రాధాన్యతగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ వ్యక్తిగత పరివర్తన సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, ప్రజలు, శ్రేయోభిలాషులను కోరారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు
.

👉 విడాకుల ప్రక్రియపై చర్చ!

జనసేన వర్గాల సమాచారం ప్రకారం, గత కొన్ని నెలలుగా ఈ అంశంపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే, విడాకులపై న్యాయస్థాన ప్రక్రియ పూర్తయినట్లు ఇప్పటివరకు స్పష్టత లేదు.

👉 మూడు వివాహ బంధాలు.. వ్యక్తిగత జీవితంలో మలుపులు!

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఇది మూడో వివాహ బంధం ముగింపు దిశగా సాగుతున్న పరిణామం. 1997లో నందినిని వివాహం చేసుకున్న ఆయన 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి రేణు దేశాయ్‌ను వివాహం చేసుకోగా, 2012లో ఆ బంధానికి చట్టపరంగా ముగింపు పలికారు. 2013లో అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించడం కూడా సమాజ బాధ్యతే!
సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్‌కు కోట్లాది మంది అభిమానులు ఉండవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయ నిర్ణయాలపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది. కానీ భార్యాభర్తల మధ్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మరో కోణానికి చెందినవి.

వివాహ బంధం కొనసాగించాలా? విడిపోవాలా? అనే నిర్ణయం ఇద్దరి పరస్పర అవగాహనకు సంబంధించినది. అందులో పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవం, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అవసరం.


బంధం ముగిసినా బాధ్యతలు ముగియవు.. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులుగా కలిసి నిలబడతామన్న పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల ప్రకటనలోని సందేశం ఇదే!

(సమాచార సౌజన్యం: హిందుస్తాన్ టైమ్స్)