పండగ తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తా.!

👉 ప్రభుత్వం వద్ద తగినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయి !

👉 రైతన్నతో ఆత్మీయ సభలో …

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


అందరం కలిసికట్టుగా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందామని, వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత “ప్రజాబలం” పేరిట అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఉత్పన్నమైన పరిస్థితుల్లో సన్నబియ్యం గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, ఒక సీజన్‌లో వడ్లు పండించకపోయినా ప్రభుత్వం వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి  పాల్గొని ప్రసంగించారు.


అంతకుముందు నియోజకవర్గం పరిధిలో ₹. 9,053 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

👉గత ప్రభుత్వంలో చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు.

👉 గడిచిన 70 ఏళ్ల కాలంలో తీవ్ర అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాకు, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దని సూటిగా ప్రశ్నించారు. కరువు కాటకాలు, వలసలతో మగ్గిపోయిన పాలమూరు జిల్లాను కచ్చితంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

👉 2028 డిసెంబర్ నాటికి కృష్ణానది జలాలతో కొడంగల్ భూములను తడిపి పచ్చని పంటలు పండించేలా చేయడం తన బాధ్యతగా చెప్పారు. అందుకు పోలేపల్లి ఎల్లమ్మ అమ్మవారి మీద ఆన అంటూ.. మాటిచ్చారు.

👉 పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రైతులతో కలిసి పాదయాత్రగా సభకు చేరుకున్నారు.


👉 ఈ ఆత్మీయ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి , వాకిటి శ్రీహరి , మహమ్మద్ అజారుద్దీన్ , సలహాదారు సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు.

👉 ఈ సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,..


పాలమూరు ఏనాడూ అభివృద్ధికి నోచుకోలేదని జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఎంతో మంది నాయకులు వచ్చినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని, ఈ ప్రాంతం పంటలకు నోచుకోలేదని ముఖ్యమంత్రి  అన్నారు.


👉 భీమా – నెట్టెంపాడు – కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు రంగారెడ్డి దశాబ్దాలైనా అడుగు ముందుకు పడలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకున్నా ప్రయోజనం దక్కలేదన్నారు. మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదేండ్లు పక్కనపెట్టారని ఆరోపించారు.


👉 అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దని ప్రశ్నించారు. కొడంగల్ ప్రాంతంలో వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు అండగా నిలవాలి. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించుకుంటూనే మరోవైపు తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు.


👉 ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసి, పరిశ్రమలు స్థాపించడం ద్వారా వేలాది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాజేంద్రనగర్ నుంచి చేవెళ్ల, షాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాలకు రహదారుల అభివృద్ధితో పాటు పరిశ్రమలు కూడా రానున్నాయని వివరించారు.


👉 ఎల్‌నినో ప్రభావం, తలెత్తిన పరిస్థితులను అవగాహన చేసుకోవాలని ముఖ్యమంత్రి  మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక తీవ్రనీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తాయని పేర్కొంటూ రైతులు ఆరుతడి పంటలు వేయాలని ముఖ్యమంత్రి  కోరారు.

👉 బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ గడ్డం పెంచుకున్నంత మాత్రాన నాయకుడు కాలేరని.. గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదని ఎద్దేవా చేశారు. పది జన్మలు ఎత్తినా తనలా కాలేరంటూ వ్యాఖ్యానించారు.

👉 జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు..!

జర్నలిస్టుల సమస్యలపైనా సీఎం రేవంత్ స్పందించారు. గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమస్యకు పరిష్కారం చూపించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మీడియా మిత్రుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.