👉 క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన శాశ్వత, తాత్కాలిక మౌలిక సదుపాయాలను గుర్తించాలి !
👉 అన్ని శాఖలు మూడు రోజుల్లోగా నిర్ణీత నమూనాలో పనుల అంచనా ప్రతిపాదనలు సమర్పించాలి !
👉 పార్కింగ్, షటిల్ బస్సులు, స్నాన ఘాట్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి !
👉 వివిధ శాఖల పనుల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
గోదావరి పుష్కరాలు –2027 ను దృష్టిలో ఉంచుకొని ధర్మపురి, ఇతర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్ల కోసం పక్కా ప్రణాళిక రూపొందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పుష్కరాల కోసం ఈ.వై. కన్సల్టెన్సీ, ఏజెన్సీ హైదరాబాద్ వారు రూపొందించిన ప్రాథమిక ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు,ఈ.వై. కన్సల్టెన్సీ, ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు.
👉 కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ,……

పుష్కరాలకు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నందున ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన పనుల పై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏజెన్సీ రూపొందించిన ప్రాథమిక ప్రణాళికను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని ఆదేశించారు.
👉 క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, పుష్కరాల సమయంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించాలని, ఈ.వై. కన్సల్టెన్సీ ఏజెన్సీ ప్రతిపాదించిన అంశాలతో పాటు అదనంగా అవసరమైన సదుపాయాలు, పనులను కూడా ప్రతిపాదించాలని తెలిపారు.
👉 గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయి ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ శాఖలకు సంబంధించిన పనుల ఎస్టిమేషన్లను మూడు రోజుల్లోగా నిర్ణీత నమూనా ఫారంలో సమర్పించాలని ఆదేశించారు.
👉 పుష్కరాల ఏర్పాట్లకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలు, అంచనాలు కచ్చితంగా ఉండాలని, ఏదైనా అవసరమైన పనికి నిధుల ప్రతిపాదనలో లోపం జరిగితే పుష్కరాల నిర్వహణ మొత్తం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
👉 భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
ధర్మపురి గోదావరి తీరంలో స్నాన ఘాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి ట్యాపులు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు.
👉 భక్తుల రాకపోకలకు అనుగుణంగా తాత్కాలిక పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి, అక్కడి నుంచి స్నాన ఘాట్లు, ఆలయానికి చేరుకునేందుకు షటిల్ బస్సుల నిర్వహణపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలన్నారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్, బస్సుల రాకపోకలు, భక్తుల నడక మార్గాలు పరస్పరం ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్మే నేజ్మెంట్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
👉 1,331.84 హెక్టార్లలో 9 జోన్లు, 20 సెక్టార్లుగా (వివిధ శాఖల) ప్రణాళిక.!
ఈ.వై. కన్సల్టెన్సీ ఏజెన్సీ రూపొందించిన లేఅవుట్ ప్రణాళిక ప్రకారం ధర్మపురిలో మొత్తం 1,331.84 హెక్టార్ల పరిధిలో పుష్కరాల ఏర్పాట్లను ప్రతిపాదించారు. ఇందులో 9 కార్యాచరణ జోన్లు, 20 సెక్టార్లుగా విభజించి వివిధ శాఖలకు బాధ్యతలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు.
👉 వసతి, బస్సులు, బస్స్టాండ్, అత్యవసర సేవలు, ఘాట్లు, మాస్టర్ కంట్రోల్ రూమ్, భక్తుల నడక మార్గాలు, ఆలయం, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్ల కోసం ప్రత్యేక జోన్లను ప్రతిపాదించారు.
👉 తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా సుమారు 161 హెక్టార్లలో పార్కింగ్, 33 హెక్టార్లలో టెంట్ సిటీ, 10 హెక్టార్లలో హోల్డింగ్ ప్రాంతాలు, 4 హెక్టార్లలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణాలు, 2.5 హెక్టార్లలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ప్రతిపాదించారు.

👉 ధర్మపురిలో సుమారు 800 మీటర్ల మేర గోదావరి ఘాట్ల అభివృద్ధి, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, కేశఖండన కేంద్రాలు, ఘాట్ల సుందరీకరణ, బ్రహ్మ పుష్కర కుండ అభివృద్ధి, జీవవైవిధ్య పార్కు, చెరువుల పునరుజ్జీవనం, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, మార్కెట్ వీధుల అభివృద్ధి, బస్టాండ్ ఆధునీకరణ, ఆలయ పరిసరాల్లో భక్తులకు అనుకూలమైన వసతుల కల్పన వంటి ప్రతిపాదనలను ఏజెన్సీ వివరించింది.
👉 ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ,…..
పుష్కరాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
👉 భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, కీలక కూడళ్లు, ఘాట్లు, ఆలయ పరిసరాల్లో పోలీసు సిబ్బందిని నియమించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
👉 సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ, ఈ.వై. కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
