చదువుతో పేదరికం పై యుద్ధం!

👉 పేదింటి బాలికల కలలకు రెక్కలు..

👉 760 మంది బాలికల బంగారు భవిష్యత్తుకు హెచ్‌ఏఎల్‌ అండ..

👉 బాచుపల్లిలో గురుకుల విద్యా ప్రాంగణం ప్రారంభం

👉 ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి.. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి:

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఒక పేదింటి ఆడబిడ్డకు నాణ్యమైన విద్య అందితే.. అది ఒక్క కుటుంబాన్నే కాదు, ఒక తరాన్ని మార్చగలదు. ఆడబిడ్డల ఆశయాలకు ఆర్థిక పరిస్థితులు అడ్డుకాకూడదనే సంకల్పానికి బాచుపల్లిలోని గురుకుల విద్యా ప్రాంగణం సాక్ష్యంగా నిలుస్తోంది. పేద విద్యార్థినుల ఉన్నత చదువులకు కార్పొరేట్ సంస్థలు సైతం సామాజిక బాధ్యతతో చేయూతనిస్తే ఎన్ని అద్భుతాలు సాధ్యమవుతాయో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌) నిరూపించింది.

హెచ్‌ఏఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో బాచుపల్లిలో నిర్మించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

👉 760 మంది బాలికలకు ఒకే ప్రాంగణంలో విద్య.. వసతి!

ఈ విద్యాసంస్థ ద్వారా సుమారు 760 మంది బాలికలకు ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్యతోపాటు వసతి సౌకర్యాలు అందుబాటులోకి రావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదని, విద్య ఒక్కటే జీవితాలను శాశ్వతంగా మార్చగల శక్తి అని పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అణగారిన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి ఆధునిక కోర్సులతోపాటు కోడింగ్, డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ అందించడం ద్వారా విద్యార్థినులకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు.

👉 విమానాలతో దేశాన్ని ఎగరేసే హెచ్‌ఏఎల్‌.. ఆడబిడ్డల ఆశయాలకూ రెక్కలు!

దేశ రక్షణ, సాంకేతిక రంగాల్లో అత్యాధునిక విమానాలను నిర్మించే హెచ్‌ఏఎల్‌.. ఇప్పుడు పేదింటి ఆడబిడ్డల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామి కావడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ విద్యాసంస్థలో చదివే బాలికలు ఐఏఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా.. పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.


👉 ఎవరెస్టును అధిరోహించిన గురుకుల బిడ్డ.. పూర్ణే స్ఫూర్తి!


గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి గుగులోతు రవి, ఐఏఎస్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. గురుకుల విద్యార్థిని మాలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచానికి తెలంగాణ గురుకులాల సత్తాను చాటిందని గుర్తుచేశారు. పూర్ణ సాధించిన విజయం ప్రతి విద్యార్థినిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. బాలికల విద్యాభివృద్ధికి హెచ్‌ఏఎల్‌ అందించిన సహకారాన్ని అభినందించారు.

👉 పేదరికం నుంచి మంత్రి స్థాయికి.. అడ్లూరి ప్రస్థానం స్ఫూర్తిదాయకం!

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్

ఎన్నో కష్టాలను అధిగమించి పేదరికం నుంచి ఎదిగి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కళాశాలలో చదివే విద్యార్థినులు ఉన్నత స్థానాలకు చేరుకుని దేశ, సమాజ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.

👉విద్యే జీవితానికి శాశ్వత సంపద: హెచ్‌ఏఎల్‌ సీఎండీ

హెచ్‌ఏఎల్‌ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. రవి మాట్లాడుతూ.. పేద విద్యార్థినుల విద్యాభివృద్ధికి భవన నిర్మాణంలో భాగస్వాములు కావడం తమ సంస్థకు గర్వకారణమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్య జీవితానికి అందించే అత్యంత విలువైన, శాశ్వతమైన సంపద అని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్ (హెచ్‌ఆర్‌) డాక్టర్ ఎం.జి. బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ (ఫైనాన్స్‌) అండ్ సీఎఫ్‌ఓ డాక్టర్ బరేన్య సేనాపతి, డైరెక్టర్ (ఇంజినీరింగ్ అండ్ ఆర్‌ అండ్ డీ) అజయ్ కుమార్ శ్రీవాస్తవ, డైరెక్టర్ (ఆపరేషన్స్‌) పి.బి. రంగారావు, జీఎం (హెచ్‌ఆర్‌) ఎస్‌.ఎస్‌. చాందేల్, ఏవీ మురళీకృష్ణ, ఉమా ఎన్. రావు, చీఫ్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్సీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ మల్లయ్య భట్టు, మంత్రి ఓఎస్డీ వై.జె. విజయ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్, జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్, హెచ్‌ఏఎల్‌, గురుకుల సంస్థల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

👉 సమాజానికి ఒక సందేశం..

ఒక భవనం నిర్మించడం అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నాలుగు గోడలు నిర్మించడం కాదు.. వందలాది జీవితాలకు భవిష్యత్తును నిర్మించడం. పేదింటి ఆడబిడ్డకు చదువు అందిస్తే ఆమె ఒక్కరే ఎదగదు.. ఆమె కుటుంబం ఎదుగుతుంది, సమాజం ఎదుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. మాలావత్ పూర్ణ ఎవరెస్టును అధిరోహించినట్లే.. నేటి గురుకుల బాలికలు కూడా విద్య అనే ఆయుధంతో జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ అధిగమించాలి. ప్రతి పేదింటి ఆడబిడ్డ కల నిజమయ్యే రోజే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది.