👉 అంబేద్కర్ ఆశయాలే సమానత్వ సమాజ నిర్మాణానికి దిక్సూచి..!
👉 అణగారిన చివరి వ్యక్తికి హక్కులు అందాలి !
👉 సంక్షేమం కేవలం ఆర్థిక సాయం కాదు.. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించాలి..!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సమాజంలో కొందరు మాత్రమే అభివృద్ధి చెందితే అది నిజమైన ప్రగతి కాదు.. సమాజంలోని అట్టడుగు వ్యక్తికి సైతం అభివృద్ధి ఫలాలు అందినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత చేకూరుతుంది. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతులు, శారీరక వైకల్యం వంటి ఏ అంశమూ ఒక వ్యక్తి ఎదుగుదలకు అడ్డంకి కాకూడదు.
ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలు, ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు కల్పించడమే సామాజిక న్యాయం అసలైన లక్ష్యం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలోనే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్లో శనివారం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్–2026’ ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ మౌలిక విలువలే సమ్మిళిత ప్రపంచ నిర్మాణానికి పునాదులని పేర్కొన్నారు. అణగారిన, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు, సమాన హక్కులు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
👉 ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదు!
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సామాజిక భద్రత, ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించడమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల దార్శనికత భారతదేశానికే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య సమాజాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణలోకి రావాలని ఆకాంక్షించారు.

👉 విద్యే సామాజిక మార్పుకు తిరుగులేని ఆయుధం!
తరతరాలుగా కొనసాగుతున్న పేదరికం, సామాజిక వివక్ష, విద్యా అసమానతలను రూపుమాపడానికి విద్యను అత్యంత శక్తిమంతమైన సాధనంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతి, పోషకాహారం, డిజిటల్ పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు, నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
👉 సంక్షేమం నుంచి సాధికారత వైపు.. హక్కుల నుంచి గౌరవప్రదమైన జీవనం వైపు!
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని కేవలం ఆర్థిక సహాయానికి పరిమితం చేయకుండా అణగారిన వర్గాల సమగ్ర అభివృద్ధి, ఆత్మగౌరవం, స్వావలంబన లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. గురుకుల విద్యా వ్యవస్థ బలోపేతం, ఉపకార వేతనాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
దివ్యాంగులకు జాలి, దయతో కూడిన దృక్పథం కాకుండా హక్కులు, సమాన అవకాశాలు, స్వతంత్రంగా జీవించే పరిస్థితులు కల్పించాలన్నారు. వయోవృద్ధులకు ఆరోగ్య భద్రత, సామాజిక రక్షణతోపాటు గౌరవప్రదమైన జీవనం అందించడం సమాజ బాధ్యతగా పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, వివక్షలేని వాతావరణం కల్పించడం సమ్మిళిత సమాజ నిర్మాణంలో భాగమని స్పష్టం చేశారు.
👉 సాంకేతిక అభివృద్ధి ప్రయోజనాలు చివరి వ్యక్తికీ చేరాలి!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వాటి ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా చేరాలని మంత్రి అన్నారు. అభివృద్ధి ఫలాలు కొద్దిమందికే పరిమితం కాకుండా పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తులతో సహా అన్ని వర్గాలకు సమానంగా అందినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం ఉంటుందన్నారు.
పేదరికం, నిరుద్యోగం, వివక్ష, విద్యా అంతరాల పరిష్కారానికి ప్రపంచ దేశాలు పరస్పర సహకారం, అనుభవాల మార్పిడి, ప్రజాకేంద్రీకృత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
👉 ప్రపంచానికి సామాజిక న్యాయ సందేశం.. భారత్ సమ్మిట్!
‘భారత్ సమ్మిట్–2026’ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కులు, సమ్మిళిత అభివృద్ధిపై విస్తృత చర్చలకు వేదికగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. భిన్నమైన ఆలోచనలు, అనుభవాలు, విధానాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రపంచ సమస్యలకు మానవీయ, ప్రజాకేంద్రీకృత పరిష్కారాలను అన్వేషించే అవకాశం కలిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో అనుసంధానమవుతూనే సామాజిక న్యాయం, సంక్షేమం, సమానత్వం, మానవ గౌరవం వంటి విలువలకు కట్టుబడి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం పరస్పర విరుద్ధమైనవి కావని, ఒకదానికొకటి బలాన్నిచ్చే అంశాలని స్పష్టం చేశారు.
👉 అణగారిన వ్యక్తి తలెత్తుకుని బతికినప్పుడే నిజమైన అభివృద్ధి!
సమాజంలోని చివరి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కులు అందినప్పుడే ప్రజాస్వామ్యం సార్థకమవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉద్ఘాటించారు. అణగారిన వ్యక్తి ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణమే లక్ష్యమని, ఎవ్వరినీ వెనుకకు వదలని ప్రపంచాన్ని నిర్మించడం అందరి సమష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు.
