సీఎం సొంత గడ్డపై అభివృద్ధి పండుగ.!

👉 కొడంగల్‌కు ₹ 9 వేల కోట్ల వరాలు !

👉 మూడు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే…!

👉 రైతు మేళా నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు.. అభివృద్ధికి భారీ ప్రణాళిక..!

👉 విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు, ఉపాధి రంగాలకు పెద్దపీట..!

👉 నవంబర్ 7, 8, 9 తేదీల్లో కొడంగల్‌లో ముఖ్యమంత్రి బిజీ బిజీ..!


J.SURENDER KUMAR,

ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కొడంగల్.. ఇప్పుడు అభివృద్ధి అజెండాతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గానికి మూడు రోజుల సమయం కేటాయిస్తూ, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఈ పర్యటనలో రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభోత్సవాలతో పాటు ఏకంగా ₹ 9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఇది కేవలం అధికారిక పర్యటన మాత్రమే కాదు.. కొడంగల్ ప్రాంత ప్రజల అభివృద్ధి ఆకాంక్షలు, భవిష్యత్తు ఆశలతో ముడిపడిన కార్యక్రమంగా నిలవనుంది.


👉 రైతు సంక్షేమానికి తొలి ప్రాధాన్యం.. (నవంబర్ 7న )


నవంబర్ 7న శనివారం ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. వ్యవసాయ స్టాళ్లను సందర్శించి ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశమై పారిశ్రామిక అభివృద్ధిపై చర్చిస్తారు.


👉 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రజలకు కొత్త వసతులు! (నవంబర్ 8న)


నవంబర్ 8న ఆదివారం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశంలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. హకీంపేటలో ₹.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలను, ₹2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.


బొంరాస్‌పేట, కొడంగల్, దుద్యాల ప్రాంతాల్లో నిర్మించిన పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సమీకృత మండల కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు. కోస్గిలో సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో జూనియర్ కళాశాల, బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు


👉 రహదారులు.. సాగునీరు.. విద్యకు భారీ కేటాయింపులు!


ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం ₹5,060 కోట్లతో చేపట్టనున్న రేడియల్ రోడ్డు-2. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నాచారం మీదుగా జాతీయ రహదారి 167N వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు.


అలాగే ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ₹1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, ₹2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులు చేపట్టనున్నారు.
విద్యారంగంలో ₹.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, ₹123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం ప్రతిపాదించారు.

కొడంగల్, కోస్గి, మద్దూరులో ₹41.83 కోట్లతో ఆధునిక బస్టాండ్లు, మద్దూరులో ₹ 20 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇవే కాకుండా సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రహదారుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, పర్యాటక హోటల్ నిర్మాణం వంటి పనులకు కూడా నిధులు కేటాయించారు.


👉 రైతు బహిరంగ సభతో ముగియనున్న పర్యటన.. (నవంబర్ 9న )


నవంబర్ 9న సోమవారం హకీంపేటలో నిర్వహించనున్న రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ తదితర పది జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


👉 కొడంగల్ భవిష్యత్తుపై ప్రజల ఆశలు..!

ఒక ప్రాంత అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడమే కాదు.. అక్కడి ప్రజలకు మెరుగైన విద్య, అందుబాటులో వైద్యం, యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం కూడా. ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రకటించిన పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే కొడంగల్ ప్రాంత సామాజిక, ఆర్థిక ముఖచిత్రంలో మార్పునకు దోహదపడే అవకాశం ఉంది.