ధర్మపురి అసెంబ్లీలో ఐదు కొత్త సింగిల్ విండోలు!

👉 గ్రామీణ రైతాంగానికి ఊరట రైతుల ముంగిటకే సహకార సేవలు !


👉మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో …

J.SURENDER KUMAR,

రైతుల అవసరాలకు అనుగుణంగా సహకార వ్యవస్థను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ధర్మపురి నియోజకవర్గంలో ఐదు నూతన వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న నియోజకవర్గంలో రైతులకు రుణాలు, ఎరువులు, పంట కొనుగోళ్లు తదితర సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ప్రత్యేక చొరవకు ఈ నిర్ణయం కార్యరూపం దాల్చింది.

నియోజకవర్గంలో సుమారు 80 శాతం ప్రాంతం గ్రామీణ, వ్యవసాయ ఆధారిత భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంది. ఇక్కడి రైతులు వ్యవసాయ అవసరాల కోసం రుణాలు పొందడం, ఎరువుల సమీకరణ, పంటల కొనుగోళ్లు, గిట్టుబాటు ధర వంటి అంశాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లారు. రైతుల అభ్యర్థనలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకొని నూతన సింగిల్ విండోల ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేశారు.

ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నెల 11న నూతన సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు.

👉 కొత్తగా ఏర్పాటైన సింగిల్ విండోలు ఇవే..

ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో రైతులకు అందుబాటులో ఉండేలా నూతన సంఘాలను ఏర్పాటు చేశారు.
ధర్మపురి మండలం – నేరెళ్ల
బుగ్గారం మండలం – బుగ్గారం
గొల్లపల్లి మండలం – మల్లన్నపేట
ఉమ్మడి వెల్గటూర్ మండల పరిధి – పాత గూడూర్
డబ్బు తిమ్మయ్యపల్లె – నూతన సహకార సంఘం

👉 రైతు సేవలకు మరింత చేరువ…

కొత్త సింగిల్ విండోల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల రైతులకు సహకార సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రుణాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, ఎరువుల పంపిణీ, పంటల కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను సులభంగా పొందేందుకు మార్గం సుగమం కానుంది. గ్రామీణ రైతాంగానికి సహకార వ్యవస్థ మరింత చేరువ కానుంది.


👉 రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక చొరవ…!


వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వ సహకార సేవలు అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. రైతుల సమస్యలను గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకోవడం ఈ నిర్ణయంలో కీలక పరిణామంగా నిలుస్తోంది.

ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఐదు కొత్త సింగిల్ విండోల ఏర్పాటు కూడా ఆ దిశగా మరో ముందడుగుగా నిలవనుంది.