👉 జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని,
రౌండ్ టేబుల్ సమావేశంలో ..
J.SURENDER KUMAR,
పత్రికలు, చానళ్లు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం తగ్గిపోతుందని, ప్రధాన స్రవంతి లోని కొన్ని మీడియా సంస్థలు వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారిపోవడంతో ప్రజా ప్రయోజనాలకు మీడియాలో ప్రాధాన్యత కొరవడుతుందని శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం విచారం వ్యక్తం చేశారు.
👉 జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీ యూడబ్ల్యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో, సోమవారం నాడు నాంపల్లిలోని మీడియా అకాడమీ భవన్ లో, అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పాల్గొని ప్రసంగించారు.
👉 రవీష్ లాంటి స్వతంత్ర జర్నలిస్టులు, వైర్ లాంటి సంస్థలు ప్రజా సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తేవడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, నేడు జర్నలిస్టులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదన్నారు. విలేకరుల నుంచి ఎడిటర్ల దాకా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, మీడియాలో వచ్చే విమర్శనాత్మక కథనాల వల్ల ప్రభుత్వ పెద్దలు నొచ్చుకుంటే వాటిని రాసిన జర్నలిస్టుల ఉద్యోగం తీసేయడానికి కూడా యాజమాన్యాలు వెనకాడటం లేదని ఆయన విచారం వ్యక్తం చేసారు. ప్రమాదంలో ఉన్న పత్రికా వ్యవస్థను పరిరక్షించుకొని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
👉 ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ, డిజిటల్, సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందుతుండడంతో మీడియా వ్యవస్థ తీరు మారిపోతున్నదన్నారు. వార్తల కోసం సాంప్రదాయ మీడియా సాధనాలైన పత్రికలు, టెలివిజన్ ఛానళ్ల మీద ఆధారపడే పరిస్థితి తగ్గిపోతున్నదని, రాయిటర్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 58 శాతం మంది వార్తల కోసం సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారని ఆమె తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి మీడియా సాధనాలలో ట్రోల్ అవుతున్న తమకు నచ్చని వార్తలను, కథనాలను ప్రభుత్వం ఆ వేదికల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి తొలగిస్తున్నదన్నారు.
👉 వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎన్నో ప్రధానమైన సమస్యలను పక్కనబెట్టి ఒక అప్రధానమైన థీమ్ ను నేషనల్ ప్రెస్ డే రోజు చర్చ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించడం విచారకరమన్నారు.
👉 ప్రధాన స్రవంతి మీడియా కార్పొరేట్ మయమై పోయిందని, జాతీయస్థాయిలో అనేక ప్రధాన పత్రికలను కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, నేటి సమాజంలో జర్నలిజం వృతి ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారిందని, జర్నలిజం ప్రజలను ఆకర్షించడానికా? లేక సమాజం పట్ల బాధ్యతను నిర్వర్తించడానికా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
👉 వీక్షకుల , పాఠకుల సంఖ్యను పెంచుకోవడం కోసం సంచలనాత్మక శీర్షికలు, అర్థసత్యాలు, వ్యక్తిగత ఆరోపణలు, నిర్ధారణ కాని వార్తల కోసం పరుగులుతీయడం వంటి చర్యలు తాత్కాలిక ఆదరణ పొందుతయే తప్ప, సమాజానికి మేలు చేయవని ఆయన అన్నారు. మీడియా ప్రజాకర్షకంగా ఉండటం తప్పు కాదని, ఆ ఆకర్షణ కోసం వాస్తవాలు, విలువలు, నైతికత బలికాకూడదని విరాహత్ సూచించారు.
👉 పత్రికా స్వేచ్ఛ, నైతిక ప్రమాణాల పరిరక్షణ కోసం 60యేండ్ల క్రితం ఆవిర్భవించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థను, నేటి పాలకులు తమ గుప్పిట్లో పెట్టుకొని వారి కనుసైగల్లో కొనసాగించడం సహించరానిదన్నారు.
ఇంకా సమావేశంలో సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె. రాంచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు నాగసూరి వేణుగోపాల్, మల్లేపల్లి లక్ష్మయ్య, నిమ్స్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ నిజామి, సామాజిక కార్యకర్త కె.సజయ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం. ఏ. మాజీద్, జాతీయ ఉపాధ్యక్షుడు వై. నరేందర్ రెడ్డి,
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్ కుమార్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుబాబు, ప్రధాన కార్యదర్శి అశోక్, యూనియన్ మహిళా విభాగం నాయకులు కళ్యాణం రాజేశ్వరీ, అత్తలూరి అరుణ తదితరులు పాల్గొన్నారు.
