సమ్మక్క సాగర్ బ్యారేజీ కి సహకరించండి!

👉 ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయికి
సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !


J.SURENDER KUMAR,

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తి చేయడానికి వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి  విష్ణుదేవ్ సాయి కి విజ్ఞప్తి చేశారు.

👉 ముఖ్యమంత్రి  నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి  విష్ణుదేవ్ సాయి తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియజేసి NOC జారీ చేయాలని కోరారు.


👉 ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.


👉 ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు.


👉 తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తద్వారా 17 ఆదివాసీ గ్రామాల ముంపుతో పాటు భద్రత, మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడుతుందని గుర్తించారు. దీంతో ముంపు ప్రాంతాన్ని తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రదేశాన్ని తుపాకులగూడెంకు మార్చారు.


👉 ప్రాజెక్టు అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కోరిన మేరకు ₹ 9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి సమర్పించింది.


👉 తుపాకులగూడెం వద్ద చేపట్టడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయని ఐఐటీ ఖరగ్‌పూర్‌ అధ్యయనంతో తేలింది. భారీ వరదల సమయంలో కూడా ప్రభావిత ప్రాంతం వంద ఎకరాలకు మించదు.

👉 ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.


👉 ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి  తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.