👉 గంటలోనే 10 లక్షల బంగారం అప్పగింత!
👉 అర్ధరాత్రి అటవీ గ్రామంలో పోలీసుల సాహసోపేత తనిఖీలు.
.👉 డయల్ 112 కాల్‌కు తక్షణ స్పందన.. బాధితుడికి భరోసా!
👉 బుగ్గారం ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ సంపత్‌కు గ్రామ యువకుల అభినందనలు!
J.SURENDER KUMAR,
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేదే నిజమైన పోలీసు సేవ. పోయిన వస్తువు దొరుకుతుందో లేదోనని ఆందోళనలో ఉన్న ఓ బాధితుడికి ఖాకీ అండగా నిలిచింది. పది తులాల బంగారం పోయిందన్న ఫిర్యాదుపై డయల్ 112 ద్వారా సమాచారం అందుకున్న బుగ్గారం పోలీసులు రాత్రివేళ రంగంలోకి దిగి, కేవలం గంట వ్యవధిలోనే సుమారు ₹10 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించి బాధితుడికి అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందన, చాకచక్యమైన విచారణ, మానవీయ దృక్పథం స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
శనివారం (7న) రాత్రి సమయంలో గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ అనే వ్యక్తి ముంబై నుంచి తన అత్తగారి ఊరు ధర్మపురికి బయలుదేరాడు. తన మరదలి వివాహం నేపథ్యంలో ముంబైలో కొనుగోలు చేసిన పది తులాల బంగారాన్ని బ్యాగులో భద్రపరుచుకున్నాడు.
జగిత్యాల చేరుకున్న అనంతరం ధర్మపురి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మార్గమధ్యంలోని వెలుగొండ స్టేజి దాటిన తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై డయల్ 112కు ఫోన్ చేశాడు.
👉 రంగంలోకి దిగిన ఖాకీ.. అర్ధరాత్రి అటవీ గ్రామంలో తనిఖీలు!
ఆ సమయంలో బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న బుగ్గారం పోలీస్ కానిస్టేబుల్ సంపత్ (2177) వెంటనే కాల్ స్వీకరించి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. విషయాన్ని ఎస్ఐ శ్రీకాంత్‌కు తెలియజేశారు. సర్కిల్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నప్పటికీ ఎస్ఐ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కానిస్టేబుల్ సంపత్తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
బాధితుడిని విచారించి వివరాలు తెలుసుకున్న పోలీసులు వెలుగొండ స్టేజి పరిసరాలను పరిశీలించారు. అనంతరం సమీపంలోని పాపి అటవీ గ్రామంలోకి వెళ్లి రాత్రి వేళ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా? అనే కోణంలో గ్రామ యువకుల నుంచి సమాచారం సేకరించారు.
👉 చాకచక్యమైన విచారణతో చిక్కిన బంగారం..!
గ్రామ యువకులు అందించిన సమాచారం ఆధారంగా ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన పోలీసులు అతడిని విచారించారు. తన బ్యాగు అనుకుని బస్సులో మరో బ్యాగును పొరపాటున తీసుకొచ్చానని అతడు వివరించాడు. రెండు బ్యాగులు ఒకే విధంగా ఉండటంతో జరిగిన పొరపాటును పోలీసులు గుర్తించారు. బ్యాగును తనిఖీ చేయగా చిన్న సంచిలో భద్రపరిచిన పది తులాల బంగారం లభించింది.
వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడు శంకర్‌ను, ఆయన బావమరిదిని పిలిపించి బంగారాన్ని వారికి అప్పగించారు. ఇది ఉద్దేశపూర్వక దొంగతనం కాదని, బ్యాగులు ఒకేలా ఉండటంతో జరిగిన పొరపాటుగా విచారణలో తేలడంతో మానవతా దృక్పథంతో వ్యవహరించారు.
👉 ఖాకీ అంటే భయం కాదు.. ఆపదలో భరోసా !
గతంలో నక్సలైట్ ప్రభావం ఉన్న అటవీ ప్రాంతంలో రాత్రివేళ వెళ్లి గ్రామ యువకుల సహకారంతో గంట వ్యవధిలోనే బాధితుడి బంగారాన్ని గుర్తించి అప్పగించడం పోలీసుల అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. కష్ట సమయంలో సామాన్యుడికి పోలీస్ స్టేషన్ అండగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. బాధితుడికి సకాలంలో న్యాయం చేసిన బుగ్గారం ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ సంపత్ పనితీరును వెలుగొండ గ్రామ యువకులు అభినందించారు.
