👉 కొడంగల్ రేర్ ఇండస్ట్రియల్ హబ్ ఆవిష్కరణ కార్యక్రమంలో..!
J. SURENDER KUMAR
కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడం తన బాధ్యత మాత్రమే కాదు. తన కల కొడంగల్తోనే నా గుర్తింపు, ఆత్మగౌరవం” అని సీఎం వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 2027 నాటికి శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. విమానాశ్రయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.
👉 కొడంగల్ రేర్ ఇండస్ట్రియల్ హబ్ (Kodangal Rare Industrial Hub) ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా హకీంపేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు వందమంది పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
👉 కొడంగల్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంతం, ఇతర పారిశ్రామిక క్లస్టర్లకు చెందిన ఏరోస్పేస్, రక్షణ రంగం, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, టెక్స్టైల్, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
👉 ఈ సమావేశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , వాకిటి శ్రీహరి తో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
👉 కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్‌తో పాటు NARI (Network of Apparel Readiness & Infrastructure) పార్క్, THRIVE (Thogapur-Dudyal Hub for Regional Industries, Value Addition and Employment) హబ్, RISE (Regional Industries & Small Enterprises) Park ను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ఆవిష్కరించారు.
👉 ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో అనువైన ప్రాంతమని, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ హబ్‌లో నిర్మాణాలు చేపడుతుండడం, మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
👉 భావితరాలకు పరిశ్రమల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, విద్యాసంస్థల ఏర్పాటుకు 250 ఎకరాల్లో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
👉 రేడియల్ రోడ్డు నిర్మాణంతో కేవలం 70 నిమిషాల్లో కొడంగల్ చేరుకునే అవకాశం ఉంటుందని, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టే ముందు మొదట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంత దూరంలో ఉందో చూస్తారని అన్నారు. రానున్న కాలంలో చందన్వెల్లి, సీతారాంపూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలు గొప్ప పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

👉 కొడంగల్ అన్ని రకాలుగా అభివృద్ధికి అనువైన వ్యూహాత్మక ప్రాంతమని, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తక్కువ దూరంలో ఉండడం విశేషమని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల వనరులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం అధికారులు నిత్యం సహకరించడానికి అందుబాటులో ఉంటారన్నారు.
