ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

👉 ప్రతి కుటుంబానికి ₹ 5 లక్షల చొప్పున జీవిత బీమా!

👉 నవంబర్ 26 నుంచి ఆడబిడ్డలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం !

👉 సిద్దిపేట బహిరంగ సభలో  సీఎం రేవంత్ రెడ్డి!


J.SURENDER KUMAR,


రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ₹ 5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 నుంచి పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.

👉 మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ  జయంతి రోజున ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.

👉 ముఖ్యమంత్రి  ప్రజలతో కలిసి ముస్తాబాద్ చౌరస్తా నుంచి 2 కి.మీ మేర పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరా గాంధీ  చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,…..

సిద్దిపేట శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మదన్ మోహన్  తొలి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

👉 వారి గుర్తుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ మెడికల్ కాలేజీగా నామకరణం చేయనున్నట్టు ఈ వేదికగా ముఖ్యమంత్రి  ప్రకటించారు. అందుకు సంబంధించి వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కు సూచించారు.

👉 మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన 14 గ్రామాల్లో నిజమైన లబ్దిదారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  భరోసా ఇచ్చారు. త్వరలోనే అధికారులు ఇళ్లలోకి వస్తారని, లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు.

👉 తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ వదులుకోదని స్పష్టం చేశారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, పాలమూరు – రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ, ఖమ్మం జిల్లాకు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గత పదేళ్లపాటు పడావు పెట్టకుండా పూర్తి చేసి ఉంటే ఈరోజు నీటి కష్టాలు ఉండేవి కాదన్నారు.

👉 1983 నుంచి 2023 వరకు కొనసాగిన ప్రభుత్వాల హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని స్పష్టం చేశారు. పైగా వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడమే కాకుండా కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించామని గుర్తుచేశారు.

👉 అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్లలోపు 50 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్, కొత్తగా రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి  వివరించారు.

👉 రుణమాఫీతో పాటు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ₹1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపామని చెప్పారు. సంక్షేమ పథకాలే కాకుండా 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన అంశాన్ని పేర్కొన్నారు.


👉 ఈ కార్యక్రమంలో మంత్రులు  దామోదర రాజనర్సింహ , పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వాకిటి శ్రీహరి , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , పి. సుదర్శన్ రెడ్డి , వి. హనుమంతరావు , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు శ్రీ బొమ్మా మహేష్ కుమార్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.