కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..,!

J SURENDER KUMAR,

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు.


👉 ఈ నెల 19న సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను ముఖ్యమంత్రి  ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


👉 రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  చెప్పారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు.


👉 ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రెండు లక్షలు, ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు.


👉 వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న ₹ 2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి ₹ 5 లక్షలకు పెంచాలని సూచించారు.


👉 రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా మినహాయించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.


👉 సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సమావేశంలో స్పష్టం చేశారు. పంపిణీకి వీలుగా చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సూచించారు.


👉 ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


👉 ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.