మహారాష్ట్ర అధికారులతో టచ్ లో ఉండండి!


👉 అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

👉 ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి , నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


👉 మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  అధికారులకు పలు సూచనలు చేశారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


👉 ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భూముల ముంపు విషయంలో మహారాష్ట్ర చేపట్టే సర్వేకు అభ్యంతరం లేదని తెలిపారు.


👉 మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఈ సమీక్షలో నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.