సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రోడ్డు ప్రమాదాలపై నివేదిక సమర్పించాలి !


👉 రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభం !
👉 రోడ్డు భద్రత ప్రమాణాల పై సంబంధిత అధికారులతో సమీక్ష లో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ !

J . SURENDER KUMAR,

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులతో పాటు ఇతర రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను విశ్లేషించి వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

👉 మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశం లో తీసుకున్న నిర్ణయాల అమలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చేపట్టాల్సిన చర్యలు, జాతీయ రహదారులపై రోడ్డు భద్రత మెరుగుదల పనుల పురోగతిపై సమీక్షించారు.


👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ,…

జిల్లాలో సుమారు 600 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయని, వీటి పై గత నెల రోజుల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి అనే వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


👉 జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు, ఇతర రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను విశ్లేషించాలన్నారు.


👉 జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, జాతీయ రహదారుల సంస్థ, ఆర్&బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయం తో ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించాలని సూచించారు. ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలను గుర్తించి, భవిష్యత్తు లో అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టమైన సూచనలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు.


👉 10 రోజులలో మరోసారి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహిస్తామని, అప్పటి లోగా ఆర్&బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గత మూడు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ నివేదిక సమర్పించాలని తెలిపారు. ప్రమాద ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను తొలగించడం, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, వేగ సూచిక బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడం వంటి చర్యలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.


👉 రోడ్డు భద్రత మెరుగుదల పనులకు అవసరమైన నిధుల అంచనాలను వెంటనే రూపొందించి, పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో దాదాపు సగం జాతీయ రహదారులపైనే చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


👉 రోడ్డు ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పనిచేయాలని, జాతీయ రహదారులపై తక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని కలెక్టర్ హెచ్చరించారు.


👉 జాతీయ రహదారుల పై తాత్కాలిక మెరుగుదల పనులు!
జాతీయ రహదారుల పై నిర్వహణ, స్వల్పకాలిక మెరుగుదల పనులకు సంబంధించి టెండర్ ముగిసినందున త్వరలోనే నిర్వహణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పనులను వేగవంతంగా చేపట్టి రహదారులపై ప్రయాణం సురక్షితంగా ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు.


👉 ఈ పనుల్లో భాగంగా రహదారులపై రాత్రివేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా రిట్రో రిఫ్లెక్టివ్ హెచ్చరిక, తప్పనిసరి, సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మలుపుల వద్ద చెవ్రాన్ మార్కర్లు, అడ్డంకులు, ప్రమాద సూచిక మార్కర్లు, రిఫ్లెక్టివ్ బ్యాండ్లతో కూడిన రోడ్ డెలినేటర్లు ఏర్పాటు చేయనున్నారు.


👉 అదేవిధంగా థర్మోప్లాస్టిక్ పెయింటింగ్‌ తో లేన్ మార్కింగ్‌లు, సెంటర్ లైన్లు, రోడ్డు అంచుల గుర్తులు, ట్రాన్స్‌వర్స్ మార్కింగ్‌లు వేయడంతో పాటు వాహనదారులకు రాత్రి వేళల్లో రహదారి స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ రోడ్ స్టడ్స్ ఏర్పాటు చేయనున్నారు.


👉 వేగ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.!

ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లు, మలుపుల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 5, 10, 15 మిల్లీమీటర్ల ప్రొఫైల్‌ తో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, గుర్తించిన ప్రాంతాల్లో సోలార్ ఆధారిత ఎల్‌ఈడీ బ్లింకర్ల ఏర్పాటు చేపట్టనున్నట్లు వివరించారు.


👉 ప్రమాద ప్రాంతాల్లో, బ్లాక్ స్పాట్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు కొండగట్టు వద్ద ప్రమాదకర మలుపుల ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు ముందుగానే అప్రమత్తమయ్యేలా హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.


👉 రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.


👉 జాతీయ రహదారుల వెంట ఆక్రమణలను తొలగించడం, అనధికార పార్కింగ్‌ను నియంత్రించడం, నిఘా, పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రద్దీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.


👉 సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలులో భాగంగా చేపట్టిన పనులన్నింటినీ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి రవాణా శాఖ, పోలీసు శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమావేశమై పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.


👉 ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ……

మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో ఎక్కువగా గాయపడుతున్నారని, తలకు గాయాలు కావడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.


👉 డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అతివేగ నియంత్రణ చర్యలను మరింత విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తించి నియంత్రించేందుకు ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు అవసరమని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను గుర్తించి ఈ-చలాన్లు జారీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు.


👉 ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి భద్రతా జాకెట్లు, బారికేడ్లు, హైబ్రిడ్ కెమెరాలు, హెల్మెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే కెమెరాల ద్వారా రహదారులపై పక్షి దృష్టితో (బర్డ్ ఐ వ్యూ) విస్తృత ప్రాంతాన్ని పర్యవేక్షించి ట్రాఫిక్ ఉల్లంఘనలను మెరుగ్గా గుర్తించవచ్చని తెలిపారు.


👉 జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడేలా అత్యవసర స్పందన వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

జాతీయ రహదారులపై ఏవైనా సమస్యలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ టోల్ ఫ్రీ నంబర్ 1033కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.


ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంభా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా శాఖ, పోలీసు శాఖ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.