👉 కష్టకాలంలో కాంగ్రెస్కు పెద్ద దిక్కు మంత్రి శ్రీధర్ బాబు..!
👉 మంత్రిపై వీడియోలు, లేఖలు సరైన పద్ధతి కాదు…!
👉 గాంధీభవన్ వేదికగా ఎంపీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు.!
J.SURENDER KUMAR,
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు.. పార్టీ కోసం కష్టపడిన నాయకుల సేవలు, కష్టకాలంలో కార్యకర్తలకు అందించిన అండదండలే శాశ్వత గుర్తింపును ఇస్తాయి. అధికారం ఉన్నప్పుడు పక్కన చేరేవారు ఎందరో ఉంటారు.. కష్టకాలంలో అండగా నిలిచేవారే నిజమైన నాయకులుగా గుర్తుండిపోతారు.
ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్లో నెలకొన్న ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇదే సందేశాన్ని వినిపిస్తున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ వీడియోలు విడుదల చేయడం, లేఖలు రాయడంపై అడ్లూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. “తమ్ముడూ.. వంశీకృష్ణ విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. వీడియోలు విడుదల చేయడం, లేఖలు రాయడం సరైన పద్ధతి కాదు” అంటూ హితవు పలికారు.
👉 కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడిని ఎలా మరిచిపోతాం..?
శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దపల్లి కాంగ్రెస్లో నెలకొన్న ప్రోటోకాల్ వివాదంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, పార్టీలో ఏవైనా సమస్యలు తలెత్తితే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఎంపీ వంశీకృష్ణ తండ్రి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారని, ఆయన పెదనాన్న కూడా ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పరోక్షంగా సూచించారు.
👉 మంత్రి శ్రీధర్ బాబు సహకారం మరువలేనిది..!
మంత్రి అడ్లూరి వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం శ్రీధర్ బాబుతో తనకున్న అనుబంధం. రాజకీయంగా తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భాల్లో మంత్రి శ్రీధర్ బాబు అండగా నిలిచారని తెలిపారు.
జెడ్పీ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సందర్భాల వరకు తనకు వెన్నుదన్నుగా నిలిచారని, ఈరోజు తాను మంత్రి స్థాయికి చేరుకున్నానంటే అందుకు శ్రీధర్ బాబు సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. తనలాంటి దళిత నాయకులకు కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం ఎలా సమంజసమని ప్రశ్నించారు.
👉 గెలిపించిన వారి కష్టాన్ని గుర్తుంచుకోవాలి…!
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు కోసం మంత్రి శ్రీధర్ బాబు ఎంతో కష్టపడ్డారని మంత్రి అడ్లూరి గుర్తుచేశారు. మంథని నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ లభించిందని పేర్కొన్నారు.
“మేమంతా కష్టపడి తమ్ముడు వంశీకృష్ణను పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిపించాం. ఈరోజు అతనే మా మీద తిరగబడితే ఎలా?” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రోటోకాల్ వ్యవహారం అధికారుల పరిధిలోని అంశమని, నిబంధనలు పాటించని అధికారులపై ఎంపీ ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అయితే ఆ సమస్యను మంత్రి శ్రీధర్ బాబుకు ముడిపెట్టి వీడియోలు విడుదల చేయడం, పదేపదే లేఖలు రాయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.
👉 పదవుల కంటే సంబంధాలు ముఖ్యం.. విమర్శల కంటే చర్చలు మేలు..!

మంత్రి అడ్లూరి వ్యాఖ్యలు పెద్దపల్లి కాంగ్రెస్లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీశాయి. ఒకవైపు ఎంపీ తనకు ప్రోటోకాల్ పరంగా తగిన గౌరవం దక్కాలని కోరుతుండగా, మరోవైపు సమస్యలను పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం మంత్రి మాటల్లో కనిపించింది.
రాజకీయాల్లో విమర్శలు చేయడం సులభమే.. కానీ కష్టకాలంలో అండగా నిలిచిన వారి సేవలను గుర్తుంచుకోవడం నాయకత్వ లక్షణం. పదవులు వచ్చినప్పుడు బాధ్యత మరింత పెరుగుతుంది. వ్యక్తిగత అభిప్రాయ భేదాలు పార్టీ బలహీనతకు కారణం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంటుంది.
