వర్షాలు పడవు కరువు  కలిసికట్టుగా ఎదుర్కొందాం!


👉రైతులను చైతన్యపరచాలి.. నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి.. ప్రకృతిని కాపాడుకోవాలి:


👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


👉 ప్రకృతి పరిరక్షణకు తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ వేదికగా కీలక పిలుపు.. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ విలువైన సూచనలు!


J.SURENDER KUMAR,


ప్రకృతి మనకు ప్రసాదించిన సహజ వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తే భవిష్యత్తు తరాలకు మిగిలేది కరువు, కన్నీళ్లేనా? వర్షాలు కురవకపోతే పంటలు ఎలా పండించాలి? తాగునీటి అవసరాలు ఎలా తీర్చాలి? పశుసంపదను ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు తెలంగాణ ముందున్న అత్యంత కీలకమైన ప్రశ్నలివి. రాబోయే ఎనిమిది నెలల పాటు వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కరువు నివారణ, నీటి సంరక్షణపై మరోసారి చర్చకు తెరలేపాయి.

👉కోవిడ్ తరహా సంక్షోభమే ఎల్‌నినో.. అప్రమత్తంగా ఉండాలి!


ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు

👉 ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే ఎనిమిది నెలలు వర్షాలు పడకపోవచ్చని, ఈ పరిస్థితిని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి తరహాలోనే ఎల్‌నినో కూడా ఒక సంక్షోభమని అభివర్ణించారు.


ప్రభుత్వం వద్ద ప్రజలకు సరిపడా బియ్యం, ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, అయితే అసలు సమస్య నీటి కొరత అని స్పష్టం చేశారు. రైతులను ముందుగానే చైతన్యపరిచి, పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.


కరువు ఒక్కసారిగా విరుచుకుపడే విపత్తు కాదని, నెమ్మదిగా ప్రారంభమై ఒక దశలో తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. రైతులు అవసరమైతే ఒక పంటను త్యాగం చేసి పశుసంపదను కాపాడుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.


👉 నీటి ప్రతి చుక్కా అమూల్యమే.. చెరువుల పునరుజ్జీవనమే కీలకం!


తెలంగాణకు చెరువులు, కుంటలు, నదులు గొప్ప సహజ సంపద అని సీఎం గుర్తుచేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప, లక్నవరం, పాకాల వంటి చెరువులు మన పూర్వీకుల నీటి నిర్వహణ దార్శనికతకు నిదర్శనాలని పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి ఒక చెరువు.. చెరువు పక్కనే గ్రామం అనే గొప్ప నీటి సంస్కృతి తెలంగాణకు ఉందన్నారు. కాలక్రమంలో ఆక్రమణలు, ఇతర కారణాలతో అనేక చెరువులు కనుమరుగయ్యాయని, వాటిని గుర్తించి పునరుద్ధరించడమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావడం వల్లే వర్షాలు కురిసినప్పుడు వరద నీరు కాలనీల్లోకి వస్తోందని చెప్పారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ తర్వాత మహిళలు తిరిగి అక్కడ బతుకమ్మ ఆడటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని గుర్తుచేశారు.


👉 మూసీ పునరుజ్జీవనం.. భవిష్యత్ తరాల కోసమే!


మూసీ నది పునరుజ్జీవనాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటి వనరులను అందించడమే లక్ష్యమన్నారు.
హైదరాబాద్‌లో వర్షపాతం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థపై పునరాలోచన అవసరమని పేర్కొన్నారు. గతంలో రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యవస్థలు, క్లౌడ్‌బరస్ట్ వంటి పరిస్థితుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకోవాల్సి వస్తోందని వివరించారు.
పెట్టుబడులు, పర్యావరణ పరిరక్షణ రెండూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, అభివృద్ధి సాధిస్తూనే ప్రకృతిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.


👉 ప్రకృతిని కాపాడుకోవడంలో ఆధ్యాత్మికతకూ బాధ్యత ఉంది: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్


ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రకృతిని దుర్వినియోగం చేయడం వల్లే ఎల్‌నినో వంటి విపరీత పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
సాంకేతిక అభివృద్ధితో పాటు ప్రకృతి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చొరవను అభినందించారు. ప్రకృతితో సమతుల్యత పాటిస్తూ అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.


👉 చెరువుల ఆక్రమణలు తొలగించాలి.. మూసీకి ప్రత్యేక నమూనా రూపొందించాలి: వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్


ప్రముఖ పర్యావరణవేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పర్యావరణ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చొరవను అభినందించారు.


రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు శుద్ధి చేసిన మురుగునీటిని అందించే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రకృతి, సంస్కృతి రెండింటినీ మ్యాపింగ్ చేయాలని చెప్పారు.


చెరువుల ఆక్రమణలను తొలగించి వాటి పునరుద్ధరణను వేగవంతం చేయాలని, మూసీ నది పునరుజ్జీవనాన్ని కూడా తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. సబర్మతి నమూనాను అనుకరించకుండా తెలంగాణ భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక మూసీ నమూనాను రూపొందించాలని అభిప్రాయపడ్డారు.


👉 నిపుణుల సూచనలతో పర్యావరణ పాలసీ.. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం!


వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు నిపుణులు, పర్యావరణవేత్తలు, రైతులు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.


తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటిస్తూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, రైతు పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి, అధికారులు, ప్రొఫెసర్లు, వ్యవసాయ, వాతావరణ రంగాల నిపుణులు, మేయర్లు, సర్పంచులు, రైతులు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.


అనంతరం గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.