👉 మంచిగా పని చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది !
👉 కొత్తగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ డీఎస్పీలతో…
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
J.SURENDER KUMAR,
పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మమేకమై పనిచేయాల్సింది మీరే మీ పనితీరే ప్రభుత్వానికి గీటురాయిగా మారుతుంది. మీరు ఉత్తమంగా పనిచేస్తే ప్రభుత్వం ప్రతిష్ట పెరగడానికి అవకాశం ఉంది అదే మీనుంచి నేను ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
👉 ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అంటుంటారని, అతి సామాన్యుడి నుంచి అతిపెద్ద హోదా ఉన్న వారు సైతం పోలీసులపై ఉన్న నమ్మకంతో అలా మాట్లాడుతుంటారు అని సీఎం అన్నారు. దేశంలో ఏడు దశాబ్దాలుగా నిరంతరం పర్యవేక్షించి సర్వం ఒడ్డి శాంతి భద్రతలు కాపాడిన మీ సీనియర్ల కారణంగానే పోలీసు శాఖ అంటే ప్రజల్లో ఒక గౌరవం వచ్చింది. వారివల్లే మీకీ గుర్తింపు వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది.
👉 పది మంది డీఎస్పీలు అరాచకంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో పరిపాలన, ప్రభుత్వం లేదని, శాంతిభద్రతలు క్షీణించడమే కాకుండా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు రావొచ్చు. అదే పది మంది డీఎస్పీలు నిటారుగా నిలబడి విధులు నిర్వర్తిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ పది రాష్ట్రాల్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే మీనుంచి నేను ఆశిస్తున్నా అని సీఎం స్పష్టం చేశారు.
👉 రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొబేషనరీ డీఎస్పీలకు ఉద్బోధించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న దృఢమైన సంకల్పంతో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామని చెప్పారు.
👉 కొత్తగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ డీఎస్పీలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన వ్యాలిడిక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శిక్షణ సమయంలో ట్రెయినీలు దిగిన ఫోటోల ప్రదర్శనను తిలకించారు. ‘క్రైమ్ సీన్ ఫోరెన్సిక్స్’ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు.
👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,….

కొత్తగా డీఎస్పీలుగా బాధ్యతలు చేపట్టినా.. మీరొచ్చిన నేపథ్యం మరిచిపోవద్దు. మరిచిపోయిన రోజు మనం మన హోదాకు న్యాయం చేయలేం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ స్థాయిలో ఉన్న వారైనా డీఎస్పీలు కావాలని కోరుకుని ఈ శాఖలోకి వచ్చారు.
👉 ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం ఈ శాఖలో చేరారు. నిబద్ధతతో, బలమైన సంకల్పంతో ప్రయత్నం చేస్తే అసాధ్యమన్నది ఏదీ ఉండదు. మీ లక్ష్య సాధనలో ఇది మొదటి చాప్టర్ మాత్రమే. ఇక్కడి నుంచి రెండో చాప్టర్ మొదలవుతుందని అన్నారు.
👉 సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరించాలని ఆలోచించడం కంటే, సమస్య ఏంటో ముందు అర్థమైనప్పుడు సగం సమస్య పరిష్కరించినట్టే. మీ దగ్గరకొచ్చే బాధితుల సమస్యలు వినండి. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ప్రపంచంలో పరిష్కారం కాని సమస్యే లేదు. సమస్య పరిష్కారానికి ముఖ్యంగా సమయం, వనరులు, సాంకేతిక సహాయం అవసరం.
👉 కరువు, కాటకాలతో అల్లాడిన కాలంలో ఆహార ధాన్యాల కృత్రిమ కొరత సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరించడానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్‌ను చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత మేలు జరడంతో పాటు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి.
👉 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి వచ్చిన తర్వాత నేరాల స్వరూపంలోనూ మార్పులొచ్చాయి. కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో దొంగ సారాయి కాసేవారు. ఇప్పుడు కొకైయిన్, హెరాయిన్, గంజాయి లాంటివి సవాలు చేసే స్థాయికి చేరుకున్నాయి.
👉 ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌లో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని, ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ట్రాఫిక్, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే స్పష్టమైన విధానం ఉండాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కడో ఉన్న వాడు కూడా మొబైల్ ద్వారా మొత్తం కాజేస్తున్నాడు.
👉 పోలీసు శాఖ ఏర్పడిన తర్వాత ఆయా అవసరాలకు అనుగుణంగా సీఐడీ, ఏసీబీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా ఎంపికైన డీఎస్పీల్లో మీ నైపుణ్యాలకు అనుగుణంగా పోలీసు విభాగాలను ఎంచుకోండి. అవసరమైతే మంచి సంస్థల్లో చేర్పించి శిక్షణ కూడా ఇప్పిస్తాం. పోలీసు శాఖలో అవుట్ సోర్సింగ్ వల్ల ఆశించిన ఫలితాలు రావు. పోలీసు శాఖలో ఇన్‌హౌజ్ సామర్థ్యాలు మెరుగుపరుచుకోవాలి.
👉 నైపుణ్యతలను పెంచుకోవడానికి గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లను మాత్రమే విదేశాలకు శిక్షణ కోసం పంపించేవారు. ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఉపాధ్యాయులను కూడా శిక్షణకు పంపించాం. మారుతున్న నేరాల స్వభావం నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి అవసరమైతే ఒకట్రెండు సంవత్సరాల పాటు శిక్షణకు పంపించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
👉 అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశాం. 2011 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 నియామకాలు చేపట్టిన తర్వాత తిరిగి 2025 లో చేపట్టాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నియామకాలు జరగలేదు. యువతీయువకులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత శిఖరాలకు ఎదగాలని బలమైన ఆకాంక్షతో ఎదురుచూసే సమయంలో ఇలాంటి నియామకాల్లో జాప్యం జరిగితే ఎంతో బాధ ఉంటుంది.
👉 మంచి అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ద్వారా తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని యువత ఎదురుచూస్తున్న సమయంలో, నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ప్రశ్నాపత్రాలు లీకై తలెత్తిన గందరగోళ పరిస్థితులు మీ అందరికీ తెలుసు.
👉 గ్రూప్-1 ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టే బోర్డులో అంతకంటే కిందిస్థాయి వారిని నియమించడం తప్పిదం. రాజకీయ పునరావాసాలు మరెక్కడైనా కల్పించవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నియామకాలు చేపట్టాల్సిన సర్వీస్ కమిషన్‌లో ఆనాటి ఉద్దేశాలు ఏమైనప్పటికీ అలాంటి తప్పిదాలు జరిగాయి.

👉 అందుకే అధికారం చేపట్టిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. యూపీఎస్సీ చైర్ పర్సన్‌తో పాటు నిపుణులతో చర్చించి ఉన్నతస్థానాల్లో ఉన్న నిపుణులను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నియమించాం. నియామకాలు చేసేవారికి అనుభవం, అంతకంటే చిత్తశుద్ధి, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే సర్వీస్ కమిషన్ పట్ల ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుంది.
👉 దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు చేయలేదు. దేశంలోనే మొదటిసారిగా ఓకేసారి 562 ఖాళీలతో గ్రూప్-1 నియామకాలు పూర్తి చేశాం. అందులో 119 మంది డీఎస్పీలుగా నియమితులయ్యారు. నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో పారదర్శకంగా పనిచేసిందని భావిస్తున్నా.
👉 తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ MCRHRD వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి , హోం శాఖ కార్యదర్శి శిఖా గోయల్ , రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి , తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ట్రెయినీ డీఎస్పీలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందించారు.
