తెరుచుకున్న శబరిమల ఆలయం !

తెరుచుకున్న శబరిమల ఆలయం !


👉 పోటెత్తిన భక్తులు – పంప వరకూ క్యూలైన్!


J SURENDER KUMAR,


హరిహర మానస సుతుడు, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల మకరు విళక్కు పూజలు కోసం సోమవారం తెరుచుకుంది. రెండు నెలలకుపైగా సాగే ఈ యాత్రా సీజన్‌లో లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామిని దర్శించుకుంటారు
.

నవంబరు 17 ఉదయం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. రోజుకు 80 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. అయితే, తొలి రోజే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఇప్పటికే అన్ని క్యూలైన్‌లు నిండిపోయి.. పంబ వరకు విస్తరించాయి.

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మండల-మకరు విళక్కు పూజలు నవంబరు 16న సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముందుగా సాయంత్రం 5 గంటలకు శ్రీధర్మ శాస్తా సన్నిధానంలోని తిరునాడ (గర్భగుడి తలుపులు) తెరుచుకుంది. తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ మార్గదర్శకత్వంలో శబరిమల కొత్త మేల్‌సంతి (ప్రధాన అర్చకులు)గా సుబ్రహ్మణ్య శంకరన్ నంబూద్రి, మాళికాప్పురం సన్నిధానం మేల్‌సంతిగా దామోదరన్ నంబూద్రిగా బాధ్యతలు స్వీకరించారు. వీరు ఇరువురూ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను అధిరోహించి సన్నిధానం చేరుకున్నారు.


అయ్యప్ప నామస్మరణ మధ్య ఆలయ ద్వారాలు తెరుచుకోగా. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో మండల మకరువిళక్కు పూజలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున నెయ్యాభిషేకం అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.


శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. పంబా వరకూ క్యూలైన్ నిండిపోయింది. సోమవారం దాదాపు 30,000 మంది భక్తులు దర్శనం కోసం వర్చువల్ క్యూలో టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.


మంగళవారం నుంచి రోజుకు 80,000 మందిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. వీరిలో, 60,000 వర్చువల్ క్యూ, నీలక్కల్‌లో 10,000 స్పాట్ బుకింగ్ కోసం రిజర్వ్ చేశారు. ఎరుమేలి, పులుమేడు వద్ద ఉన్న సాంప్రదాయ అటవీ మార్గాల ద్వారా ఒక్కొక్క మార్గంలో 3,000 చొప్పున, వండిపెరియార్ సత్రం మార్గం వద్ద 2,000 చొప్పున టోకెన్లు జారీచేస్తారు. వీటన్నింటికీ ముందుగా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. పంబ వద్ద స్పాట్ బుకింగ్ అందుబాటులో ఉండదు.

ఈసీజన్‌లో ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు ఆలయం తెరిచి, సుప్రభాత సేవ అనంతరం దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. నెయ్యాభిషేకం ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న పూజ తర్వాత ఆలయం గంటకు మూసివేసి 3 గంటలకు తిరిగి తెరుస్తారు. రాత్రి 11 గంటలకు దర్శనాలు కల్పించి, హరివరాసనం అనంతరం మూసివేస్తారు.

👉 డిసెంబరు 27తో మండలు పూజలు పూర్తయి.. రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి, మకరువిళక్కు కోసం డిసెంబరు 30 తెరుస్తారు.

👉 జనవరి 14న మకరవిళక్కు..

జనవరి 20న పదునెట్టాంబడి పూజ అనంతరం ఆలయం మూసివేయడంతో ఈ యాత్రా ముగుస్తుంది. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, జిల్లా యంత్రాంగం, తాత్కాలిక సౌకర్యాలు, వైద్య సహాయ కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంబడి ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను సమన్వయం చేశాయి. 41 రోజుల పాటు దీక్షను చేపట్టి ఇరుముడి కట్టుకుని దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనం కోసం లక్షలాది మంది తరలివస్తారు.